62YearsOfKamalism: నాలుగేళ్ల వయసులో ‘అవార్డు’ రేంజ్‌ యాక్టింగ్‌.. ఆపై కోట్లాది అభిమానగణం

12 Aug, 2021 13:04 IST|Sakshi

మహానటుడనే ట్యాగ్‌ లైన్‌కు ఏమాత్రం తీసిపోని వ్యక్తి ఈయన. ఆయన నటనే కాదు.. డ్యాన్స్‌లు, ఫైట్లు ప్రతీదాంట్లోనూ ఓ వైవిధ్యమే కనిపిస్తుంటుంది. ప్రయోగాలంటే ఇష్టపడే ఆయన్ను అభిమానులు ముద్దుగా పిల్చుకునే పేరు ‘ఉళగ నాయగన్‌’. పేరుకే ఆయన తమిళ నటుడు. కానీ, స్ట్రెయిట్-డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు ‘లోకనాయకుడి’గా సుపరిచితుడు. కమల్‌ హాసన్‌.. సౌత్‌ సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పేరు. సరిగ్గా 62 ఏళ్ల క్రితం నటుడిగా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది ఇవాళే. 

కమల్‌ హాసన్‌.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన తొలి చిత్రం ‘కళథూర్‌ కణ్ణమ్మ’. కేవలం నాలుగేళ్ల వయసుకే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు కమల్‌. (సినిమా రిలీజ్‌ అయ్యింది మాత్రం 1960లో..)  ఇందులో యుక్తవయసులో ఓ జంట చేసిన తప్పు.. దానికి ఫలితంగా తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా అనాథగా క్షోభను అనుభవిస్తూ.. చివరికి తం‍డ్రి-తల్లి పంచన చేరి ఆప్యాయతను పొందే చిన్నారిగా కమల్‌ నటన ఆకట్టుకుంది. అంత చిన్నవయసులో ‘సెల్వం’ క్యారెక్టర్‌లో అంతేసి భావోద్వేగాలను పండించడం ఆడియొన్స్‌నే కాదు.. ఆ సినిమా లీడ్‌ ద్వయం జెమినీ గణేశన్‌-సావిత్రిలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది కూడా. అలా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తొలి చిత్రం కళథూర్‌ కణ్ణమ్మ ఆరేళ్ల వయసుకే ఏకంగా రాష్ట్రపతి గోల్డ్‌ మెడల్‌ తెచ్చిపెట్టింది బుల్లి కమల్‌కు.

నటనకు బీజం
కమల్‌ అసలు పేరు పార్థసారథి. చిన్నవయసులో బాగా చురుకుగా ఉండే పార్థూ.. తండ్రి శ్రీనివాసన్‌ అయ్యంగార్‌ ప్రొత్సాహంతో కళల పట్ల ఆసక్తికనబరిచాడు. కమల్‌ తల్లి సరస్వతికి దగ్గరి స్నేహితురాలు ఒకామె ఫిజీషియన్‌గా పని చేస్తుండేది. ఒకరోజు పార్థూను తన వెంటపెట్టుకుని డ్యూటీకి వెళ్లిందామె. ఏవీఎం(ఏవీ మెయ్యప్పన్‌) ఇంటికి ఆయన భార్య ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లగా.. ఏవీఎం తనయుడు శరవణన్‌ పార్థూను చూసి ముచ్చటపడ్డాడు. పార్థూ చలాకీతనం శరవణన్‌ను బాగా ఆకట్టుకుంది. అదే టైంలో ఏవీఎం బ్యానర్‌లో దర్శకుడు బీష్మ్‌సింగ్‌ ఓ ఎమోషనల్‌ కథను తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాలో కొడుకు క్యారెక్టర్‌ కోసం పార్థూను రికమండ్‌ చేశాడు శరవణన్‌. అలా నాలుగేళ్లకు పార్థూ అలియాస్‌ కమల్‌ హాసన్‌ నటనలో అడుగుపెట్టాడు. జెమినీ గణేశన్‌-సావిత్రి జంటగా తెరకెక్కిన కళథూర్‌ కణ్ణమ్మ కొన్ని కారణాలతో ఆలస్యంగా 1960, ఆగష్టు 12న రిలీజ్‌ అయ్యింది. అయితేనేం సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. హిందీలో సునీల్‌దత్‌-మీనాకుమారి జంటగా ‘మై చుప్‌ రహూంగీ’, సింహళంలో ‘మంగళిక’ తెలుగులో నాగేశ్వర రావు-జమున జంటగా ‘మూగ నోము’ పేరుతో రీమేక్‌ అయ్యి అంతటా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 

కళథూర్‌ కణ్ణమ్మ తర్వాత మరో నాలుగు తమిళం, ఒక మలయాళం సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు కమల్‌. ఆ తర్వాత ఏడేళ్లపాటు కెమెరాకు వెనకాల మేకప్‌ ఆర్టిస్ట్‌, డ్యాన్స్‌ మాస్టర్‌గా పని చేశాడు. అటుపై చిన్నాచితకా పాత్రల్లో కనిపించి.. 1974లో మలయాళ చిత్రం ‘కన్యాకుమారి’తో హీరోగా మారాడు. అలా ‘కళథూర్‌ కణ్ణమ్మ’ ఒక అద్భుతమైన నటుడిని భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. అందుకే #62YearsOfKamalism ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. 


-సాక్షి, వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు