వరుసగా మూడు సీక్వెల్స్‌... కమల్‌ స్పీడు మామూలుగా లేదు

20 Aug, 2022 10:09 IST|Sakshi

పార్ట్‌ వన్‌ హిట్‌...  హిట్‌ వన్‌ సాధించిన జోష్‌తో హిట్‌ టూ మీద టార్గెట్‌ ఉండటం కామన్‌. ఇప్పుడు కమల్‌హాసన్‌ ‘హిట్‌ 2’ మీద టార్గెట్‌ పెట్టారు. అంటే... హిట్‌ అయిన పార్ట్‌ వన్‌కి కొనసాగింపుగా పార్ట్‌ 2లో నటించనున్నారు. వరుసగా మూడు సీక్వెల్స్‌ చేయనున్నారు కమల్‌. ఆ విశేషాల్లోకి వెళదాం. 

కమల్‌హాసన్‌ మంచి జోష్‌లో ఉన్నారు. దానికి ఒక కారణం ‘విక్రమ్‌’ ఘనవిజయం సాధించడం. విజయాలు కమల్‌కి కొత్త కాకపోయినా ఈ కరోనా పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సంశయిస్తున్న తరుణంలో హిట్‌ సాధించడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘విక్రమ్‌’ సుమారు రూ. 500 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కానే కాదు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ కూడా నటించారు. గత జూన్‌లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్‌ రూపొందించనున్నారు. అయితే ఈ సీక్వెల్‌ ఆరంభం కావడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే కమల్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌’ (భారతీయుడు) సీక్వెల్‌ మీద దృష్టి సారించారు. 

22నుంచి ‘ఇండియన్‌ 2’ సెట్లోకి... 
సేనాధిపతి (ఇండియన్‌)గా, చంద్రబోస్‌ (చంద్రు)గా కమల్‌హాసన్‌ రెండు పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్‌’ (1996). దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమర యోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ నిర్మాణంలో ఉంది. కరోనా లాక్‌డౌన్, ఈ సినిమా చిత్రీకరణలో జరిగిన ప్రమాదం, చిత్రనిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కి ఏర్పడిన వివాదం (రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ పాన్‌ ఇండియా సినిమా కమిట్‌ అయ్యారు. అయితే ‘ఇండియన్‌ 2’ని పూర్తి చేయకుండా శంకర్‌ మరో ప్రాజెక్ట్‌ చేయకూడదంటూ లైకా సంస్థ కోర్టుకి వెళ్లింది).. ఇలా పలు కారణాల వల్ల ఈ చిత్రానికి బ్రేక్‌ పడింది. ఈ నెల 22న తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారట. కాజల్‌ అగర్వాల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.
 
120 పేజీల కథతో ‘రాఘవన్‌ 2’ రెడీ 
కమల్‌హాసన్‌ నటించిన హిట్‌ చిత్రాల్లో ‘వేట్టయాడు విలైయాడు’ (రాఘవన్‌) ఒకటి. 2008లో గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కి సీక్వెల్‌ రానుంది. ఈ సీక్వెల్‌కి కథ కూడా రెడీ అయిందట. 120 పేజీల బౌండ్‌ స్క్రిప్ట్‌ని తయారు చేశారు గౌతమ్‌. రైట్‌ టైమ్‌లో షూటింగ్‌ ఆరంభిస్తామని కూడా పేర్కొన్నారు. పార్ట్‌ వన్‌లో జ్యోతిక, కమలినీ ముఖర్జీ కథానాయికలుగా నటించారు. సీక్వెల్‌లో ఓ నాయికగా కీర్తీ సురేష్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘ఇండియన్‌ 2’ తర్వాత కమల్‌ ‘రాఘవన్‌’ సీక్వెల్‌ సెట్స్‌లోనే ఎంటరవుతారని చెన్నై టాక్‌. ఆ తర్వాత ‘విక్రమ్‌ 2’ ఆరంభమయ్యే అవకాశం ఉంది. 

శభాష్‌ నాయుడు కూడా...
ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ సీక్వెల్స్‌ ప్లాన్‌ చేసుకోవడంతో పాటు కమల్‌ ‘శభాష్‌ నాయుడు’ చిత్రం కూడా చేయనున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం ఈ చిత్రం ఆరంభమైంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ అప్పుడే కమల్‌ ఇంట్లో జారిపడటంతో పెద్ద గాయమే అయింది. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్‌ వల్ల షూటింగ్‌ ఆగింది. బ్రహ్మానందం, శ్రుతీహాసన్‌ కీలక పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని కూడా మళ్లీ ఆరంభించాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు