Kamal Haasan Assets: కమల్‌ హాసన్‌కు ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయి? ఎంత చదువుకున్నాడు?

7 Nov, 2021 16:17 IST|Sakshi

కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులు మనసు దోచుకున్న గొప్ప వ్యక్తి ఆయన. ఆయన్ని పొగడని విమర్శకుడు లేడు. ఆయన పొందని ప్రశంస లేదు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. మక్కల్‌ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి.. ఈ ఏడాది జరిగిన తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి  వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. నేడు(నవంబర్‌ 7)కమల్‌ హాసన్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను తెలుసుకుందాం.
(చదవండి: కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్)

హీరోగా వందలాది చిత్రాల్లో నటించిన కమల్‌ హాసన్‌.. భారీగానే ఆస్తులను కూడబెట్టాడు. ఆయనకు 176 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కమల్‌ పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు నామినేషన్‌ వేయడానికి వచ్చినప్పడు తనకు మొత్తం రూ.176.93 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. అందులో స్థిరాస్తుల విలువ రూ.131.84కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.45.09కోట్లు ఉన్నట్లు తెలిపాడు. లండన్‌లో రూ.2.50 కోట్లు విలువ చేసే ఇల్లు.. రూ.2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు కమల్ హాసన్ తెలిపారు. అంతేకాదు తనకు రూ.49.5 కోట్ల అప్పు ఉన్నట్లు వెల్లడించారు. ఇక చదువు విషయానికొస్తే.. తను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించాడు. 

మరిన్ని వార్తలు