Vikram Movie Press Meet: అందుకే థియేటర్‌ని గుడితో పోల్చుతాను

2 Jun, 2022 00:30 IST|Sakshi

– కమల్‌హాసన్‌

‘‘పాన్‌ ఇండియా ట్రెండ్‌ అనేది కొత్త న్యూస్‌ అంతే. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఏఎన్‌ఆర్‌గారి ‘దేవదాస్‌’ తెలుగు వెర్షన్‌ చెన్నైలో మూడేళ్లు ఆడింది. నా ‘మరో చరిత్ర’ కూడా అలానే ఆడింది. అలాగే  ‘సాగర సంగమం’ చిత్రాన్ని తమిళ్‌లో డబ్‌ చేస్తే సిల్వర్‌ జూబ్లీ హిట్‌ అయింది.. ‘స్వాతిముత్యం’ సినిమా కూడా.

పాన్‌ ఇండియా అనేది బాలచందర్‌లాంటి దర్శకులు ఎప్పుడో ప్రూవ్‌ చేశారు’’ అని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘విక్రమ్‌’. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో రేపు (శుక్రవారం) విడుదల కానుంది. నిర్మాత సుధాకర్‌ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ విలేకరులతో పంచుకున్న విశేషాలు...

  భారీ యాక్షన్‌ థ్రిల్లర్, డార్క్‌ మూవీ ‘విక్రమ్‌’. లోకేశ్‌ కనగరాజ్‌ అద్భుతంగా తీశారు. ఈ కథలో విక్రమ్‌ ఎవరు? అనేది ముందే చెప్పేస్తే ఆ మ్యాజిక్‌ పోతుంది. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలుంటాయి.

► అంత ధైర్యం ఉన్నవాళ్లు చాలా తక్కువ
ఈ రోజుల్లో సినిమా బాగా ఆడటం, సినిమా బాగుండటం రెండూ ఛాలెంజే. మంచి సినిమా తీస్తే ఆడదనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్స్‌కి ఉంది. అలా కాదని నిరూపించడానికి కాస్త ధైర్యం కావాలి. అంత ధైర్యం ఉన్న బాలచందర్, విన్సెంట్‌ మాస్టర్‌ లాంటి వాళ్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు.  

► నేను ఆర్టిస్ట్‌ని!
నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యత
ఉంటుంది. ‘విక్రమ్‌’లోనూ విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ పాత్రలకు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. నన్ను నేను ఎప్పుడూ స్టార్‌ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్‌ని. అభిమానులు ప్రేమతో స్టార్‌ అని పిలుస్తారు.

► ఫోన్‌ చేయగానే చేస్తాను అన్నాడు
‘విక్రమ్‌’లో సూర్య ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్ర గురించి తనను కలిసి, మాట్లాడదామని ఫోన్‌ చేశాను. మరో మాట మాట్లాడకుండా ‘నేను చేస్తా అన్నయ్యా’ అన్నారు. మా బ్యానర్‌లో సూర్యతో సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.

► రజనీ, నాది భిన్నమైన ఫిలాసఫీ
నేను, రజనీకాంత్‌ నలభై ఏళ్లుగా కలుస్తూనే ఉన్నాం. మా సినిమాలు, స్నేహితుల గురించి మాట్లాడుకుంటాం. రాజకీయాల గురించి చాలా తక్కువ మాట్లాడతాం. ఎందుకంటే మా ఇద్దరిదీ భిన్నమైన ఫిలాసఫీ.

► 400 థియేటర్లలో...
హీరో నితిన్, వారి నాన్న సుధాకర్‌ రెడ్డిగారికి సినిమా అంటే ప్యాషన్‌. వారు ‘విక్రమ్‌’ని 400 థియేటర్లలో విడుదల చేస్తున్నందుకు స్పెషల్‌ థ్యాంక్స్‌.     

► రామానాయుడుగారు పాన్‌ ఇండియా ప్రొడ్యూసర్‌  
ప్రస్తుతం హైదరాబాద్‌ నేషనల్‌ ఫిలిం మేకింగ్‌ హబ్‌గా ఉంది. ఇంతకు ముందు చెన్నై ఉండేది. నాగిరెడ్డిగారి లాంటి దర్శకులు ‘మాయాబజార్‌’ లాంటి చిత్రాలను తెలుగు– తమిళ్‌లో తీసేవారు. రాముడు–భీముడు(తెలుగు), ఎంగ వీట్టు పిళ్ళై (తమిళ్‌), రామ్‌ ఔర్‌ శ్యామ్‌ (హిందీ).. ఈ చిత్రాలన్నీ ఒకే నిర్మాణ సంస్థ (రామానాయుడు సురేష్‌ ప్రొడక్షన్స్‌) తీసింది. ‘చంద్రలేఖ’ మొదటి పాన్‌ ఇండియా సినిమా. అలాగే ఇప్పుడు ‘బాహుబలి’. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు ఇతర భాషా సినిమాలు నిర్మించలేదు కానీ సౌత్‌ నుండి అన్ని భాషల చిత్రాలు తెరకెక్కాయి. రామానాయుడుగారు అన్ని భాషల్లో చిత్రాలు నిర్మించారు. ఆయన నేషనల్‌ ప్రొడ్యూసర్‌.. పాన్‌ ఇండియా నిర్మాత.  

► థియేటర్‌ అనుభూతి వేరు
ఓటీటీలు వచ్చినా థియేటర్‌ అనుభూతి వేరు. థియేటర్‌ గుడి కంటే గొప్ప చోటు అని భావిస్తా. ఎందుకంటే పక్కనున్నవాడు ఏ జాతి? ఏ మతం? అనే పట్టింపు ఎవరికీ ఉండదు. అందుకే థియేటర్‌ని గుడితో పోల్చాను. ఇది కేవలం స్పోర్ట్స్, సినిమా థియేటర్‌లోనే సాధ్యపడుతుంది.

► విశ్వనాథ్‌గారితో ఫోనులో మాట్లాడుతుంటా
డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌గారి వల్ల నాకు ఒకటి అలవాటయ్యింది. సినిమా కోసం ఏం చేయమన్నా తప్పకుండా చేస్తాను. చెన్నైలో ఉన్నప్పుడు వారానికి, నెలకి ఒకసారైనా విశ్వనాథ్‌గారిని కలిసేవాణ్ణి.. ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఫోన్‌లో తరుచూ మాట్లాడుతుంటాను.   

► సౌత్‌లో ఇది కొత్త కాదు  
దక్షిణాదిలో సినిమా, రాజకీయానిది విడదీయరాని కలయిక. నా ముందు తరం వారు అన్నింటినీ బ్యాలెన్స్‌ చేశారు.. నేను కూడా అదే చేస్తున్నాను. నా నుండి ప్రేక్షకులు ఏడాదికి రెండు సినిమాలైనా కోరుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే ఇది సాధ్యపడదు. అందుకే నటనపై దృష్టి పెట్టాలని భావి స్తున్నాను. ‘భారతీయుడు 2’ని ఈ ఏడాదిలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం.

మరిన్ని వార్తలు