-

36 ఏళ్లనాటి చిత్రాలకు సీక్వెల్‌ తీసి హీట్‌ కొట్టిన హీరోలు..

10 Jul, 2022 19:32 IST|Sakshi

వారిద్దరూ స్టార్‌ హీరోలే. ఒకరు యాక్షన్ హీరో అయితే.. మరొకరు యూనివర్సల్‌ హీరో. రియల్ స్టంట్స్‌ చేస్తూ యాక్షన్‌ సీన్లలో అదరగొట్టేది ఒకరైతే.. నటనలో విశ్వరూపం చూపిస్తూ మెస్మరైజ్‌ చేసేది ఇంకొకరు. ఈ ఇద్దరు ఆరు పదుల వయసువారే. ఒకరికి 60 అయితే మరొకరికి 67. ఈ వయస్సులో కూడా పోరాట సన్నివేశాలు చేస్తూ, నటనలో ఏ మాత్రం కాంప్రమైజ్‌ అవ్వకుండా ఐ ఫీస్ట్‌ చేస్తారు. వారిద్దరికీ ప్రేక్షకులు, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌.  వీరి సినిమాలు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని అభిమానులు పడిగాపులు పడుతుంటారు. వచ్చే వరకు ఆరాదిస్తూనే ఉంటారు. ఇలా ఒక సూపర్‌ హిట్ కోసం అటు ఆ హీరోలు.. ఇటు వారి ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న తరుణంలోనే ఇద్దరు తమ సినిమాలను ఒకే ఏడాది రిలీజ్‌ చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టారు. అందులోనూ సుమారు 36 ఏళ్ల క్రితం చిత్రాలను సీక్వెల్‌గా తెరకెక్కించి ఈ ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలుగా రికార్డు సైతం క్రియేట్‌ చేశారు. మరీ ఆ స్టార్‌ హీరోలెవరో తెలుసుకుందామా.

'విక్రమ్‌: ది హిట్‌ లిస్ట్‌' సినిమా 2022 జూన్ 3న విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారు నాలుగేళ్ల తర్వాత ఉలగ నాయగన్‌ (లోక నాయకుడు) కమల్‌ హాసన్‌కు మాసీవ్‌ కమ్‌బ్యాక్‌ హిట్‌ ఇచ్చింది ఈ మూవీ. అయితే ఈ సినిమాను డైరెక్టర్‌ లోకేష్ కనకరాజ్‌ మల్టీవర్స్‌ తరహాలో (LCU-లోకేష్ సినిమాటిక్‌ యూనివర్స్) తెరకెక్కించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కార్తీ 'ఖైదీ' సినిమా సీన్లను చూపించడం, తర్వాత 'ఖైదీ 2'లో కూడా కమల్‌ హాసన్‌ విక్రమ్‌గా కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా 'విక్రమ్‌ 3'లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని కమల్‌ హాసన్‌ ఒక ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌ 3' అని ఎందుకు అన్నారు ? అంటే ఇప్పటికే 'విక్రమ్‌ 2' వచ్చిందా ? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి 'విక్రమ్‌: ది హిట్‌ లిస్ట్‌' కన్నా ముందు 1986లో 'విక్రమ్‌' సినిమా వచ్చింది. ఇదే 'రాజ్‌ కమల్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్ బ్యానర్‌'లో 'ఏజెంట్‌ విక్రమ్‌ 007' రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ పాత్ర కొనసాగింపుగా తాజాగా 'విక్రమ్‌: ది హిట్‌ లిస్ట్‌'ను రూపొందించారు లోకేష్‌ కనకరాజ్‌. అంటే ఈ 'విక్రమ్‌: ది హిట్‌ లిస్ట్‌ (విక్రమ్‌ 2)', 1986లో వచ్చిన 'ఏజెంట్‌ విక్రమ్‌ 007' చిత్రాల కథా నేపథ్యం ఒకే లైన్‌పై ఆధారపడింది. దీన్ని బట్టి చూస్తే 'ఏజెంట్‌ విక్రమ్‌ 007'కు 'విక్రమ్‌ 2' సీక్వెల్‌ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా 1986లో కమల్‌ హాసన్‌కు ఒక క్రేజ్‌ తీసుకొచ్చింది. కెరీర్‌ ప్రారంభంలో తడబడుతున్న కమల్‌ హాసన్‌కు ఒక ‍బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రూ. కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ 'ఏజెంట్‌ విక్రమ్‌ 007' బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 8 కోట్లను కొల్లగొట్టాడు.

అంతేకాకుండా ఈ మూవీలోని టైటిల్‌ ట్రాక్‌లో (విక్రమ్‌ టైటిల్‌ సాంగ్‌) మొట్ట మొదటిసారిగా కంప్యూటర్‌ బేస్‌డ్‌ వాయిస్‌ (రోబోటిక్‌ వాయిస్‌లా)ను ఉపయోగించారు సంగీతం దర్శకుడు ఇళయరాజా. ఈ వాయిస్‌ ఇప్పటికీ ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అయితే ఈ వాయిస్‌ను 'విక్రమ్‌: ది హిట్‌ లిస్ట్‌' టైటిల్‌ ట్రాక్‌లో కూడా కొనసాగించారు కోలీవుడ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌. ఈ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక్కో బీజీఎం ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. 'విక్రమ్‌: ది హిట్‌ లిస్ట్‌' మూవీ సుమారు రూ. 120-150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 442.45 కోట్లు రాబట్టింది. కాగా సరైన హిట్‌ లేకుండా సతమవుతున్న కమల్‌ హాసన్‌కు.. 36 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ కథ నేపథ్యంగా తెరకెక్కిన ఈ 'విక్రమ్‌ 2' సెన్సేషనల్‌ హిట్‌గా నిలవడం విశేషం. 1986లో 32 ఏళ్ల వయసులో కమల్‌ ఎలాంటి నటనతో అలరించాడో 67 ఏళ్ల వయసులో కూడా అంతకుమించిన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.  

ఇక కమల్‌ హాసన్‌లానే కెరీర్‌ ప్రారంభంలో స్ట్రగులై అదే 1986లో హిట్‌ కొట్టిన మరో స్టార్‌ హీరో టామ్‌ క్రూజ్‌. ఈ హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో రియల్‌ స్టంట్స్‌, ఫ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరోకు కూడా కెరీర్‌ ఆరంభంలో సూపర్ క్రేజ్‌ తీసుకొచ్చిన మూవీ 'టాప్‌ గన్‌'. 1986 మే 16న విడుదలైన 'టాప్‌ గన్‌' అప్పుడు ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రూ. 1.5 కోట్ల (యూఎస్‌ డాలర్స్‌) బడ్జెట్‌ తెరకెక్కిన ఈ చిత్రం రూ. 35.73 కోట్లు (యూఎస్‌ డాలర్స్‌) రాబట్టింది. తర్వాత అనేక యాక్షన్‌ మూవీస్‌తో అదరగొట్టిన టామ్ క్రూజ్‌కు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్‌ పడలేదు. అయితే సుమారు 36 ఏళ్ల తర్వాత 'టాప్‌ గన్‌'కు సీక్వెల్‌గా 'టాప్‌ గన్‌: మావెరిక్‌' వచ్చి టామ్‌ క్రూజ్‌కు సాలిడ్‌ సక్సెస్‌ ఇచ్చింది. 

'టాప్‌ గన్‌'లో 24 ఏళ్ల వసయసులో బాడీ లాంగ్వేజ్‌, ఫిట్‌నెస్‌, యాక్టింగ్‌, రొమాన్స్‌తో టామ్‌ క్రూజ్‌ ఎలా అయితే ఆకట్టుకున్నాడో 59 ఏళ్ల (సినిమా చిత్రీకరణ సమయంలో) వయసులోనూ  అదే  జోష్‌తో మెస్మరైజ్‌ చేశాడు. ఇప్పటికీ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో రియల్‌ స్టంట్స్‌ చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక 2022 మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టాప్‌ గన్‌: మావెరిక్‌' సుమారు 170 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్‌ వద్ద సుమారు 1. 131 బిలియన్‌ డాలర్లను కొల్లగొట్టింది. ఇక ఆరు పదుల వయసులోనూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న కమల్ హాసన్‌, టామ్‌ క్రూజ్‌.. యాక్టింగ్‌, యాక్షన్‌ స్టంట్స్‌లో 'ఇద్దరూ.. ఇద్దరే' అనిపించుకుంటున్నారు. కాగా 36 ఏళ్ల క్రితం సినిమాలను సీక్వెల్‌గా తెరకెక్కించి, హిట్ లేని సమయంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన కమల్‌, టామ్‌లది ఎంతటి యాదృచ్ఛికం. 

-సంజు (సాక్షి వెబ్‌డెస్క్‌)

మరిన్ని వార్తలు