Rohini theatre Issue: టికెట్‌ కొనుగోలు చేసిన వారికి థియేటర్‌లోకి ఎంట్రీ..కమల్‌ తీవ్ర ఖండన

1 Apr, 2023 11:50 IST|Sakshi

చైన్నెలోని రోహిణి థియేటర్‌ నిర్వాహకం చర్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నటుడు శింబు కథనాయకుడిగా నటించిన చిత్రం పతు తల. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. దీంతో శింబు అభిమానులు వేకువజాము నుంచే థియేటర్‌ ముందు గుమికూడారు. అలాంటి వారిలో సంచార జాతి ప్రేక్షకులు ఉన్నారు. వీరు స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్లో పత్తుతల చిత్రాన్ని చూడడానికి వచ్చారు. టికెట్లు కూడా కొనుగోలు చేసి థియేటర్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ థియేటర్‌ కార్మికుడు వారిని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో కొంత సమయం తర్వాత వారిని లోపలికి అనుమతించారు.

అయితే ఈ వ్యవహారంపై థియేటర్‌ నిర్వాహకం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని కమలహాసన్‌, విజయ్‌సేతుపతి, సూరి, దర్శకుడు వెట్రిమారన్‌, నటి ప్రియా భవానిశంకర్‌ తీవ్రంగా ఖండించారు. తాజాగా కమలహాసన్‌ ట్విటర్లో పేర్కొంటూ టికెట్‌ తీసుకున్న తర్వాత కూడా సంచార జాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించకపోయిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన తర్వాత వారిని అనుమతించడం ఖండించదగ్గ విషయం అని పేర్కొన్నారు.

దర్శకుడు వెట్రిమారన్‌ శ్రమజీవులను థియేటర్లోకి రానీయకుండా అడ్డుకోవడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. సూరి స్పందిస్తూ జరిగిన సంఘటనకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియా భవాని శంకర్‌ స్పందిస్తూ సంచార జాతి ప్రజలకు మద్దతు తెలిపారు. అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నప్పుడు టికెట్‌ ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు థియేటర్లోకి అనుమతించడం లేదు అని సంచార జాతి మహిళా ప్రశ్నే ఇలాంటి వ్యతిరేక చర్యలకు తొలి గొంతు అని భవాని శంకర పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక కోయంబేడు పోలీసులు రోహిణి థియేటర్‌ నిర్వాకంపై అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు