తోబుట్టువులకు కంగన ఖరీదైన బహుమతి!

2 Feb, 2021 14:46 IST|Sakshi

ముంబై: సంతోషాన్ని కుటుంబంతో పంచుకుంటే రెట్టింపు అవుతుందంటున్నారు బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌. అందుకే తన తోబుట్టువులు, కజిన్స్‌కు జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చినట్లు తెలిపారు. వారి కోసం విలాసవంతమైన అపార్టుమెంట్లు నిర్మించి ఇస్తున్నానని, రెండేళ్లలో కలల సౌధం నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ అనేక కష్టనష్టాలకోర్చి.. బీ-టౌన్‌లో స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకునే ఆమెను.. ఫ్యాషన్‌, తను వెడ్స్‌ మను, క్వీన్‌, మణికర్ణిక వంటి చిత్రాలు తనను అగ్రస్థానంలో నిలిపాయి. (చదవండి: ఉక్కు మహిళగా కంగనా)

ఇక ఇప్పటికీ అదే క్రేజ్‌తో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కంగన అదే స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమె సంపాదన కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కుటుంబం కోసం కంగన సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, చండీగఢ్‌లో అపార్టమెంట్లు నిర్మించి ఇస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తన తోబుట్టువులు రంగోలి, అక్షయ్‌ రనౌత్‌తో పాటు కజిన్స్‌కు కూడా ఇందులో భాగం ఇవ్వనున్నారని బీ-టౌన్‌ టాక్‌. 

తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఈ ఫైర్‌బ్రాండ్‌.. ‘‘తమ సంపదను కుటుంబంతో పంచుకొమ్మని నేను సలహా ఇస్తాను... ఆనందం పంచుకుంటేనే మరింత ఎక్కువవుతుంది. అందమైన, విలావసంతమైన అపార్టుమెంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 2023 నాటికి పూర్తవుతాయి. నా కుటుంబం కోసం ఈ మాత్రం చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ వ్యాఖ్యలతో నిలిచే కంగన.. తలైవి, తేజస్‌, ధాకడ్‌ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు