రాజకీయ ప్రవేశంపై స్పందించిన కంగనా రనౌత్‌

15 Aug, 2020 18:01 IST|Sakshi

ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా.. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు హీరోయిన్‌ కంగనా రనౌత్‌. అలానే మోదీకి మద్దతుగా మాట్లాడటంలో కూడా ముందుంటారు కంగనా. దాంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారని.. అందుకే మోదీకి మద్దతు ఇస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పందించిన కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చాయని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పలు పార్టీలు తనకు టికెట్‌ ఇవ్వడానికి ప్రయత్నించాయని తెలిపారు కంగనా. అయితే తాను రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. ఈ మేరకు కంగనా శనివారం ట్వీట్‌ చేశారు. మోదీకి మద్దతివ్వడంపై స్పందించారు.

‘నేను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నందువల్లనే మోదీ జీకి మద్దతు ఇస్తున్నానని భావించే ప్రతి ఒక్కరికీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. మా తాత వరుసగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. నా కుటుంబం రాజకీయాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. గ్యాంగస్టర్‌ చిత్రం తరువాత దాదాపు ప్రతి సారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌ వచ్చేది’  అంటూ ట్వీట్‌ చేశారు కంగనా. అంతేకాక ‘కాంగ్రెస్ నుంచే కాక, అదృష్టవశాత్తూ మణికర్ణిక చిత్రం తర్వాత బీజేపీ నుంచి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌ వచ్చింది. ఒక ఆర్టిస్ట్‌గా నా పని అంటే నాకు ఎంతో ప్రేమ. రాజకీయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఇకనైనా ఈ ట్రోలింగ్‌లు ఆపితే మంచిది’ అంటూ కంగనా ట్వీట్‌ చేశారు. (నా కోసం కూడా అవార్డు కొనాలి కదా!)

నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా విజయం సాధించడంతో కంగన వేడుక చేసుకున్నారు. ‘మోదీజీ ఆలోచనలు ఆశయాలు, దృక్పథాలు చాలా బలమైనవి. ఆయన పాలనతో భారత్‌ ఎంతో అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం’ అంటూ ట్వీట్‌ చేశారు. అప్పటి నుంచి అడపాదడపా మోదీని పొగుడుతుంటారు కంగనా. ఈ నేపథప్యంలో ఆమె రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. 

మరిన్ని వార్తలు