Kangana Ranaut: ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి: కంగనా

23 Mar, 2023 16:26 IST|Sakshi

ఎలాంటి విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్‌. అందుకే ఆమెకు ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించింది. అటు సినిమాలతో పాటు.. ఇటు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అందుకే కంగనా అంటే కాంట్రవర్సీ క్వీన్‌ అని కూడా పిలుస్తారు. తన మాటలు కాంట్రవర్సీ అయినా కూడా.. ధైర్యంగా ఎదుర్కొగల సత్తా ఆమెది. మార్చి 23న కంగనా రనౌత్ బర్త్‌ డే సందర్భంగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఆమె ప్రయాణంపై ఓ లుక్కేద్దాం.

కంగనా రనౌత్ మార్చి 23 1987లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని  భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు. ఆమె  తల్లిదండ్రుల కోరికతో డాక్టర్ అవ్వాలని  అనుకునేవారు. కానీ తన 16వ ఏటనే  కెరీర్ కోసమని ఢిల్లీకి వచ్చారు. అదే సమయంలో మోడలింగ్‌ వైపు అడుగులు వేశారు. ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంది.

ఆ తర్వాత వోహ్ లమ్హే (2006), లైఫ్ ఇన్ ఎ మెట్రో (2007), ఫ్యాషన్ (2008) సినిమాలతో గుర్తింపు దక్కించుకుంది. ఈ మూడు సినిమాలకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డులు కూడా అందుకున్నారు. ఆమెకు ఇప్పటివరకూ మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు దక్కాయి. హృతిక్ సరసన ఆమె నటించిన క్రిష్- 3 సినిమా ఆమె కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో  ఒకటిగా నిలిచింది.
  

(ఇది చదవండి: ఓటీటీకి బలగం మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

ఇవాళ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు కంగనా. ఎవరైనా తన వల్ల బాధపడి ఉంటే క్షమించాలని ఆ వీడియో కోరింది. ఇవాళ ఆమె 36వ బర్త్‌ డే జరుపుకుంటున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన కంగనా తన గురువులకు ధన్యవాదాలు తెలిపింది.   

కంగనా మాట్లాడుతూ..'నన్ను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోనివ్వని నా శత్రువులు. నేను ఎంత సక్సెస్ సాధించినా.. నన్ను నా కాలి మీద నిలబడేలా విజయపథంలో నడిపించారు. వారే నాకు పోరాడటం నేర్పించారు. నేను వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. మిత్రులారా నా భావజాలం చాలా సులభం.  నా ప్రవర్తన, ఆలోచనలు సరళమైనవి. నేను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే కోరుకుంటున్నా. నేను దేశ సంక్షేమం గురించి మాట్లాడిన విషయాలు ఎవరినైనా బాధపెట్టి ఉండొచ్చు. అందులో కేవలం మంచి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి.' అని అన్నారు.

కాగా.. రెండు రోజుల క్రితమే కంగనా నటుడు దిల్జిత్ దోసాంజ్‌ను టార్గెట్ చేసింది. ఖలిస్తానీలకు మద్దతుగా నిలిచినందుకు పోలీసులు అతడిని త్వరలో అరెస్టు చేస్తారని పేర్కొంది. ఆమె గతంలో అలియా భట్, స్వర భాస్కర్, అమీర్ ఖాన్, తాప్సీ పన్నులతో కూడా విభేదించింది. కాగా..ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ, చంద్రముఖి-2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 

మరిన్ని వార్తలు