అందుకే నాపై కక్ష గట్టారు.. చూద్దాం: కంగన

15 Sep, 2020 14:57 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బాలీవుడ్‌ మూవీ మాఫియా, డ్రగ్‌ రాకెట్‌ గురించి బయటపెట్టినందు వల్లే తనపై కక్షగట్టారని ఆరోపించారు. అన్నింటికీ మించి తన తనయుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం ఆయనకు పెద్ద సమస్యగా పరిణమించిందని, తాను చేసిన పెద్ద నేరం ఇదేనంటూ కంగన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి: జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు)

ఈ మేరకు.. ‘‘ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు ఆదిత్య ఠాక్రేకు వినోదం పంచే మూవీ మాఫియా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హంతకులు, డ్రగ్స్‌ రాకెట్‌ గురించి నేను బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న అసలైన సమస్య, నేను చేసిన అదిపెద్ద నేరం ఇదే. అందుకే వాళ్లు నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు, సరే చూద్దాం.. ఎవరు ఎవరిపై పగ తీర్చుకుంటారో!!!’’ అని కంగన ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు. (చదవండి: వాళ్లతో స్నేహం చేయడం నేరమా: ఆదిత్య ఠాక్రే)

ఆదిత్యపై కంగన విసుర్లు
ఇక బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే పేరును ప్రస్తావించకుండా బేబీ పెంగ్విన్‌ అంటూ కంగన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్‌ నటులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, అందుకే సుశాంత్‌ హంతకులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఆదిత్యపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు స్పందనగా నటులతో స్నేహం చేయడం నేరం కాదని, అనవసరంగా తనను వివాదంలోకి లాగవద్దంటూ ఆదిత్య ట్వీట్‌ చేశారు. 

నా మాటలు సరైనవే
పీఓకే వ్యాఖ్యలతో కంగన- శివసేనల మధ్య తలెత్తిన మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. శివసేన ఎంపీ, ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ విమర్శలకు స్పందించిన కంగన.. భారీ భద్రత నడుమ బుధవారం ముంబైలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే బీఎంసీ అధికారులు పాలిలోని ఆమె ఆఫీసులో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూల్చివేత ప్రారంభించారు. దీంతో కంగన కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ఈ నేపథ్యంలో సీఎం ఠాక్రేపై ఫైర్‌ అయిన కంగన.. ‘‘ఈరోజు నా ఇంటిని కూల్చారు. రేపు మీ అహంకారం కుప్పకూలుతుంది’’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

దీంతో ఓ న్యాయవాది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంకు మర్యాద ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా..  కంగన సోమవారం ముంబైని వీడి స్వస్థలం మనాలికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంబైని పీఓకేతో పోల్చిన తన మాటలు సరైనవే అంటూ మరోసారి సమర్థించుకోవడంతో శివసేన నేతలు ఆమెపై మండిపడ్డారు. కుక్కతోక వంకర సామెతను గుర్తు చేస్తూ కంగనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.   

మరిన్ని వార్తలు