కంగనకు సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు

24 Jul, 2020 15:58 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించిన నాటి నుంచి ఇండస్ట్రీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు  చేసుకుంటున్నాయి. బాలీవుడ్‌లోని బంధుప్రీతి కారణంగానే సుశాంత్‌ మరణించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సుశాంత్‌ మరణించిన నాటి నుంచి సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. అందుకోసం ఎంత దూరమైన వెళ్తానని కంగనా స్పష్టం చేశారు. సుశాంత్‌ మరణించిన తర్వాత ఓ వీడియో విడుదల చేసిన కంగనా, ఆదిత్య చోప్రా తన స్నేహితుడైన కరణ్ జోహార్‌తో కలిసి, కావాలనే సుశాంత్ కెరీర్‌ను నాశనం చేశాడని ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా ముంబై పోలీసులు సుశాంత్‌ కేసులో ప్రశ్నించేందుకు కంగనాకు సమన్లు జారీ చేశారు. నటి లాయర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు)

అంతేకాక మార్చి 17 నుంచి కంగనా మనాలీలో ఉన్నారని.. ఓ బృందాన్ని అక్కడకు పంపి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సిందిగా పోలీసులను కోరినట్లు కంగనా లాయర్‌ తెలిపారు. సుశాంత్‌ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీ ఉండగా ఫోన్‌ చేశారని, అయితే తన స్టేట్‌మెంట్‌ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాలేదని కంగనా గతంలోనే తెలిపారు. అంతేకాక ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి ఇచ్చేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ సుశాంత్ కేసులో ముంబై పోలీసులు 39మందిని విచారించారు. వీరిలో కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా, యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) చైర్మన్ ఆదిత్య చోప్రా, వైఆర్ఎఫ్ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ ఉన్నారు. (‘ఇక చాలు.. రాజీనామా చేస్తున్నాను’)

మరిన్ని వార్తలు