Kangana Ranaut: అలా చేసేందుకు ఆయన చాలా శ్రమించారు.. కంగనా ట్వీట్ వైరల్

11 Feb, 2023 14:55 IST|Sakshi

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే కొందరు తనపై గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్టార్‌ హీరోపై సంచలన కామెంట్స్ చేసింది బాలీవుడ్ భామ. హీరో అమిర్‌ ఖాన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పేరును కనీసం ప్రస్తావించడానికి కూడా ఆయన ఇష్టపడలేదని విమర్శించారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో కంగనాను అమిర్ ఖాన్ ప్రశంసించారు. అయినప్పటికీ ఇవేమీ ఆమెను పెద్దగా ప్రభావితం చేయలేదని తెలుస్తోంది. 

అయితే ప్రముఖ రచయిత్రి శోభా డే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బయోపిక్ తీస్తే ఆ పాత్ర ఎవరు బాగా పోషిస్తారని అమీర్‌ను శోభా డే అడిగారు. దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, అలియా భట్‌ల పేర్లను అమిర్ ఖాన్ చెప్పారు.  అయితే శోభా మాత్రం కంగనా రనౌత్‌ పేరును గుర్తు చేసింది. ఆ తర్వాత అవును కంగనా కూడా మంచి హీరోయిన్ అని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. కంగనా ట్వీట్ చేశారు. 

 కంగన తన ట్వీట్‌లో రాస్తూ.. 'అయ్యో పాపం ఆమిర్‌.. నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డారు. కాకపోతే అది వీలు కాలేదు. నా పేరును ప్రస్తావించినందుకు థ్యాంక్యూ శోభా. మా ఇద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ, నా కళను ప్రశంసించడంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇదే నిదర్శనం' అంటూ పోస్ట్ చేశారు. అయితే కంగనా ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమిర్‌ మిమ్మల్ని ప్రశంసించినప్పటికీ మీరు విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. మీ గొప్పల కోసం ఇతరులను కించపరచడం సరైన పద్ధతి కాదు అని కామెంట్లు పెడుతున్నారు.


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు