ఆ ఎనిమిదినీ అంతం చేయాలి

20 Sep, 2020 03:24 IST|Sakshi

‘‘మన భారతీయ చిత్రసీమల్లో హిందీ పరిశ్రమ మాత్రమే పెద్దది అనుకోవడం పొరపాటు. తెలుగు పరిశ్రమ కూడా టాప్‌ ప్లేస్‌లో ఉంది’’ అన్నారు కంగనా రనౌత్‌. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నోయిడాలో ఫిల్మ్‌ సిటీ నిర్మించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘యోగి ఆదిత్యనాథ్‌గారి నిర్ణయం అభినందించదగ్గది. సినిమా పరిశ్రమలో ఇలాంటి సంస్కరణలు చాలా జరగాలి. అయితే భారతీయ సినిమా అంటే హిందీ మాత్రమే కాదు. తెలుగు మేకర్స్‌ ప్యాన్‌ ఇండియా సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు.

వివిధ కారణాల వల్ల ఒక్కో ఇండస్ట్రీగా మనందరం ఉన్నప్పటికీ మన పరిశ్రమలన్నీ కలసి ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీగా మారాలి. మనందరం ఇలా విడివిడిగా ఉండటం డబ్బింగ్‌ అవుతున్న హాలీవుడ్‌ సినిమాలకు ఉపయోగకరంగా మారింది. ఉత్తమమైన ప్రాంతీయ చిత్రాలకు దేశవ్యాప్త గుర్తింపు లభించదు. కానీ హాలీవుడ్‌ సినిమాకు దేశవ్యాప్త విడుదలలు ఏంటి? హిందీ సినిమాల్లో కరువవుతున్న నాణ్యత, మోనోపోలీ వల్లే ఇదంతా. మనందరం సినిమా పరిశ్రమను వివిధ టెర్రరిజమ్‌ల నుండి కాపాడాలి. వాటిని అంతం చేయాలి. అవేంటంటే...
► నెపోటిజమ్‌ టెర్రరిజమ్‌
► డ్రగ్స్‌ మాఫియా టెర్రరిజమ్‌
► సెక్సిజమ్‌ టెర్రరిజమ్‌
► ప్రాంతీయ మరియు మతపరమైన టెర్రరిజమ్‌
► విదేశీ సినిమాల టెర్రరిజమ్‌
► పైరసీ టెర్రరిజమ్‌
► శ్రమ దోపిడీ టెర్రరిజమ్‌
► ప్రతిభను దోచుకునే టెర్రరిజమ్‌..

ఈ ఎనిమిది టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి’’ అని ట్వీట్‌ చేశారు కంగనా.

మరిన్ని వార్తలు