మిస్టర్‌ కంగనా రనౌత్‌ గురించి త‍్వరలోనే చెబుతా

11 Nov, 2021 11:57 IST|Sakshi

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆమె ఇటీవల ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు వచ్చే ఐదేళ్లలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనాలని భావిస్తున్నట్లు పేర్కొంది. రీసెంట్‌గా టైమ్స్‌ నౌ సమ్మిట్‌ 2021కి హాజరైన క్వీన్‌ తాను కచ్చితంగా తాళి కట్టించుకుంటానని, తల్లి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. 'నేను వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఒక తల్లిగా, భార్యగా, నూతన భారతదేశ ఆధునీకరణలో పాల్గొనే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. మిస్టర్‌ కంగనా రనౌత్‌ గురించి త‍్వరలో అందరు తెలుసుకుంటారు' అని కంగనా పేర్కొంది. 

కంగనా రనౌత్‌ ఈ మధ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అంతకుముందు ఆమె నాలుగో సారి ఉత్తమ నటి కింద జాతీయ చలనచిత్ర అవార్డును కూడా పొందారు. 'ఒక కళాకారిణిగా నేను చాలా అవార్డులు అందుకున్నాను. ప్రేమ, గుర్తింపును పొందాను. ఈరోజు నేను ఈ దేశం, ఈ ప్రభుత్వం నుంచి మోడల్ సిటిజన్‌గా అవార్డును అందుకున్నాను. నేను కెరీర్‌ను ప్రారంభించినపుడు విజయాన్ని అందుకోవడానికి 8 నుంచి 10 సంవత‍్సరాలు పట్టింది. కానీ చివరికీ నేను విజయం సాధించాను. సినీ ఇండస్ట్రీలో డబ్బు కంటే ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నాను. నా మీద విమర్శలు గుప్పించిన వారందరికీ ఈ అవార్డు సమాధానం చెబుతుంది. దీంతో వాళ్లందరీ నోళ్లు మూతపడతాయి.' అని కంగనా రనౌత్‌ తన ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకుంది.

మరిన్ని వార్తలు