Chetan Kumar: ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

22 Mar, 2023 10:26 IST|Sakshi

ప్రముఖ కన్నడ నటుడు చేతన్‌ కుమార్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభవాలను దెబ్బతీసే విధంగా ఇటీవల ఆయన చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. దీంతో చేతన్‌ కుమార్‌పై హిందుమత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఆయనను అరెస్ట్‌ చేశారు. వివరాలు.. స్వయాన హిందువైన కన్నడ నటుడు చేతన్‌ కుమార్‌ అహింస మత విశ్వాసాలను కించపరుస్తూ సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మార్చి 20న ఆయన ట్వీట్‌ చేస్తూ ‘సావర్కర్: రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి చేరుకున్న తర్వాత భారతదేశ జాతి ప్రారంభమైంది అనేది ఒక అబద్ధం. 1992: బాబ్రీ మసీదు రాముడి జన్మస్థలం అనేది ఒక అబద్ధం. 2023: ఉరిగౌడ-నంజిగౌడ కులస్తులు టిప్పుని చంపిన హంతకులు అనేది ఒక అబద్ధం’ అంటూ ట్వీట్‌ చేశాడు. అలాగే అంతేకాదు హిందుత్వం అనేది సత్యం చేత ఓడించబడుతుందంటూ హిందు మతాన్ని, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసేలా అభ్యంతరకర కామెంట్స్‌ చేశాడు. దీంతో చేతన్‌ కుమార్‌పై పలు హిందు మతసంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

కులాలు, మతాల మధ్యనే  శత్రుత్వం పెరిగిలా ఆయన ట్వీట్‌ ఉందంటూ చేతన్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా పలు హిందు సంఘాలు బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు చేతన్‌ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా చేతన్‌ కుమార్‌ తరచూ తన తీరుతో, కామెంట్స్‌తో వివాదానికి తెరలేపుతుంటాడు. గతంలో ఇలానే అభ్యంతరకర కామెంట్స్ చేసి ఒకసారి అరెస్ట్ అయ్యాడు. 2022 ఫిబ్రవరిలో హిజాబ్ కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పై అభ్యంతర కామెంట్స్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. 

మరిన్ని వార్తలు