కన్నడ నటుడి మృతి: అమెరికా రాయబార కార్యాలయం సంతాపం

16 Jun, 2021 10:03 IST|Sakshi

వర్ధమాన నటుడు విజయ్‌కు అశ్రుతాంజలి

సొంతూరిలో అంత్యక్రియలు

యశవంతపుర: బైక్‌ ప్రమాదంలో కన్నుమూసిన వర్ధమాన నటుడు సంచారి విజయ్‌ (38) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం స్వస్థలం చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పంచనహళ్లిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆయన భౌతికకాయాన్ని ప్రజల దర్శనార్థం బెంగళూరు రవీంద్ర కళాక్షేత్రంలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంచారు. కన్నడ సినీ ప్రముఖులు అనేకమంది శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్వస్థలానికి తీసుకెళ్లారు.  

అవయవాల దానం
సోమవారం బ్రెయిన్‌డెడ్‌ అయిన విజయ్‌ అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. రెండు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, 21 హృదయ సంబంధమైన భాగాలను వైద్యులు సేకరించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన చనిపోగా సాయంత్రం 6:50 గంటలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

స్నేహితుని తోటలో ఖననం
చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న విజయ్‌ తన స్నేహితుడు రఘుతో కలిసి పంచనహళ్లిలో పెరిగారు. విజయ్‌ విగతజీవిగా గ్రామంలోకి చేరుకోగానే బరువెక్కిన హృదయాలతో గ్రామస్థులు, అభిమానులు తరలివచ్చారు. కడసారి చూసుకుని అశ్రుతాంజలి అర్పించారు. అనంతరం స్నేహితుడు రఘు తోటలో వీరశైవ లింగాయత సంప్రదాయం ప్రకారం భౌతికకాయాన్ని ఖననం చేశారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి తుటాలను పేల్చి గౌరవ వందనం గావించారు. అమెరికా రాయబార కార్యాలయం కన్నడంలో సంతాప సందేశాన్ని పంపించింది.

చదవండి: నటుడు దుర్మరణం: స్నేహితుడిపై కేసు

రోడ్డు ప్రమాదం: నటుడు సంచారి విజయ్‌ బ్రెయిన్‌ డెడ్‌

మరిన్ని వార్తలు