గుండెపోటుతో క‌న్న‌డ క‌మెడియ‌న్ మృతి

24 Sep, 2020 19:01 IST|Sakshi

బెంగ‌ళూరు: క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న క‌మెడియ‌న్‌, నటుడు రాక్‌లైన్ సుధాక‌ర్ (65) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. నేడు గురువారం షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలో ఉద‌యం ప‌ది గంట‌ల‌కు గుండెపోటు రావ‌డంతో కుప్ప‌కూలిపోయారు. ఆయ‌న్ను వెంట‌నే ద‌గ్గ‌రిలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికీ అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. కాగా కొంత కాలం క్రితం క‌రోనా బారిన ప‌డ్డ ఆయ‌న ఈ మ‌ధ్యే వైరస్‌ను జ‌యించి పూర్తి ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తిరిగి య‌థావిధిగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇంత‌లోనే ఆయ‌న అకాల మ‌ర‌ణం చెంద‌డంతో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర విషాదంలో మునిగింది. (చ‌ద‌వండి: ప్రముఖ నటుడికి కోర్టు నోటీసులు)

సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.  కాగా 1992లో 'బెల్లి మొడ‌గ‌లు' అనే చిత్రంలో ఓ చిన్న పాత్ర‌తో సుధాక‌ర్ వెండితెర‌పై ప్ర‌వేశించారు. త‌న ప్ర‌తిభ‌తో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో సినిమాల్లోనూ క‌నిపించారు. ఉపేంద్ర 'టోపీవాలా', య‌శ్ 'మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి', 'భూత‌య్య‌న మొమ్మ‌గ అయ్యు', 'అయ్యో రామా', 'ల‌వ్ ఇన్ మ‌ధ్య'‌, 'పాంచ‌రంగి', 'ప‌ర‌మాత్మ'‌ వంటి ప‌లు హిట్ సినిమాల్లో న‌టించారు. సుమారు 200 క‌న్న‌డ‌ సినిమాల్లో క‌నిపించారు. కాగా టాలీవుడ్‌లోనూ హాస్య న‌టుడు కోసూరి వేణుగోపాల్ క‌రోనాతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. (చ‌ద‌వండి: కరోనాతో తెలుగు హాస్య నటుడు మృతి)

>
మరిన్ని వార్తలు