బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. శాండల్‌వుడ్ సీనియర్ దర్శకుడు నగేశ్ బాబు (82) కన్నుమూశారు. వయో భారం, అనారోగ్య సమస్యలతో ఇటీవల బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలో నగేశ్ బాబు మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. (చదవండి: తండ్రి కన్నుమూత.. సింగర్ భావోద్వేగం)
అసిస్టెంట్ డైరెక్టర్‌గా
మండ్య జిల్లాలో జన్మించిన నగేశ్ బాబు ప్రేమాడ పుత్రి(1957) అనే కన్నడ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. తూగుదీప, నన్న కర్తవ్య వంటి పలు హిట్ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. అనిరీక్షిత సినిమా కోసం మెగాఫోన్ పట్టిన నగేశ్ బాబు.. బెంగళూరులోని గాంధీ నగర్లో ప్రగతి అనే పేరుతో ఓ స్టూడియోను నెలకొల్పారు. ఇక 2009లో ఆయన రూపొందించిన 87 నిమిషాల నిడివి గల తత్వమసి- యు ఆర్ అనే ఇంగ్లిష్ డాక్యుమెంటరీని పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. కాగా నగేశ్ బాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.