Rishabh Shetty: టాలీవుడ్ సినిమాలో రిషబ్ శెట్టి.. అతని గురించి ఎవరికీ తెలియని విషయాలు..!

22 Oct, 2022 15:59 IST|Sakshi

ప్రస్తుతం అందరి నోటా మార్మోగుతున్న సినిమా పేరు 'కాంతార'. కన్నడలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఆ హీరో ఎవరు? ఆయన గత చరిత్ర ఏంటి? అని సినీ ప్రేక్షకులు నెట్టింట్లో వెతుకుతున్నారు. అతని గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కసారి తెలుసుకుందాం.

రిషబ్ శెట్టి నేపథ్యం: కాంతార హీరో రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. కర్ణాటకలోని కుందాపూర్‌లో 1983 జులై 7న ఆయన జన్మించారు. హిందూ కుటుంబంలో పుట్టిన అతని తండ్రి పేరు భాస్కర్ శెట్టి. తల్లి పేరు లక్ష్మి శెట్టి. రిషబ్‌  ప్రవీణ్ శెట్టి అనే సోదరుడు ఉన్నాడు. రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిలిం డైరెక్షన్‌లో డిప్లొమా చేసిన ఆయన కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అతను తెరకెక్కించిన ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అలా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది.

(చదవండి: ‘కాంతార’ మూవీపై కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

సినిమా అంటే ఫ్యాషన్: రిషబ్ శెట్టి పలు టీవీ సిరీస్‌ల్లోనూ పనిచేశారు. ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంట్లో వాళ్లు ఈ పని మానేసి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోమని సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఆయనకున్న ఫ్యాషన్‌తో సినిమా రంగంలోనే కొనసాగారు. రిషబ్ 2010లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 'నామ్ ఓరీలి ఒండినా' అనే చిత్రంలో పెద్దగా ప్రాధాన్యత లేని రోల్‌లో నటించారు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన 'తుగ్లక్'లోనూ కనిపించారు. ఇలా చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశాలు నామమాత్రంగానే వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయలేదు.

నటన కంటే దర్శకత్వంపైనే ఆసక్తి : కానీ ‍అదే సమయంలో రిషబ్‌కు దర్శకత్వంపై ఆసక్తి ఏర్పడింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు డైరెక్షన్ చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. అలా 2017లో రక్షిత్ శెట్టి ఆయనకు ఓ అవకాశం ఇచ్చారు. రిషబ్ డైరెక్షన్‌లో వచ్చిన మొదటి సినిమా 'రిక్కీ' 2016లో విడుదలైంది. ఈ మూవీలో హరిప్రియ హీరోయిన్‌గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. 

(చదవండి: త్వరలో 'కాంతార' హీరో రిషబ్‌ శెట్టితో సినిమా: అల్లు అరవింద్‌)

ఆ తర్వాత చేసిన ‘కిరిక్ పార్టీ’ మూవీ రిషబ్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక రిషబ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఈ చిత్రంలో కూడా రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. రష్మిక మందన్నా ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్‌గా పాపులర్ అయింది. ఆయనకు నటుడిగా ‘బెల్ బాటమ్’ మూవీ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు.

ఆ సినిమాకు జాతీయ అవార్డు:  రిషబ్ శెట్టి తెరకెక్కించిన మూడో చిత్రం 'సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగడ్'. 2018లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో రిషబ్‌కు నేషనల్ అవార్డు వరించింది. ఈ మూవీకి నిర్మాత కూడా అతనే. అంతే కాకుండా ఫిలిం ఫేర్ అవార్డు, ఐఫా అవార్డు, సైమా అవార్డులు కూడా కైవసం చేసుకుంది. 

అయితే కాంతార హీరో ఓ టాలీవుడ్‌ సినిమాలో కూడా నటించారన్న సంగతి ఎక్కువ మందికి తెలియదు. ఈ ఏడాది తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంలో ఖలీల్ పాత్రలో నటించారు. రిషబ్‌కు 2017లో ప్రగతి శెట్టిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను ప్రస్తుతం నిర్మాతగా ఒక చిత్రం, దర్శకుడిగా మరో మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించారు కూడా.

మరిన్ని వార్తలు