Kantara Movie Review In Telugu: ‘కాంతార’ మూవీ రివ్యూ

15 Oct, 2022 12:47 IST|Sakshi
Rating:  

టైటిల్‌: 'కాంతార : లెజెండ్
నటీనటులు:  రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి
గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే, తదితరులు
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్ 
నిర్మాత: విజయ్ కిరగందూర్
తెలుగు పంపిణీ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్
దర్శకత్వం:  రిషబ్ శెట్టి
సంగీతం - అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రాఫర్ - అరవింద్ ఎస్ కశ్యప్
ఎడిటర్ - ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్
విడుదల తేది: అక్టోబర్‌ 15,2022(తెలుగులో)

‘కాంతారా’ కథేంటంటే
ఈ కథ 1847లో ప్రారంభం అవుతుంది. వేల కోట్ల సంపద, మంచి కుటుంబం ఉన్నా ఓ రాజుకు ప్రశాంతత మాత్రం లభించదు. కావాల్సినవన్నీ ముందున్నా.. ఏదో లోటు ఉందని మదన పడుతుంటాడు. ఓ స్వామిజీ సూచన మేరకు ప్రశాంతత కోసం ఒంటరిగా వెళ్తాడు. ఏ ప్రదేశానికి వెళ్లినా ఆయన మనసుకు ప్రశాంతత లభించదు. చివరిలో ఓ అడవిలోకి వెళ్తుండగా.. అక్కడ ఓ దేవుడి శిల ముందు ఆగిపోతాడు. అది చూడగానే మనసు తేలికైపోతుంది. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. దీంతో ఆ దేవుడి శిల తనకు కావాలని అక్కడి ప్రజలను కోరతాడు. దానికి బదులుగా ఏం కావాలన్న ఇస్తానంటాడు.

Kantara Movie Review In Telugu

అయితే అక్కడ కోలం ఆడే వ్యక్తి ( ఓ వ్యక్తికి దేవుడు పూనడాన్ని కోలం అంటారు).. ఆ శిలకు బదులుగా ఆ అడవినంతా అక్కడ ప్రజలకు ఇవ్వాలని చెబుతాడు. దీంతో ఆ రాజు ఆ అడవి భూమిని అక్కడి ప్రజలకు దానం చేసి దేవుడి శిలను తీసుకెళ్తాడు. కట్‌ చేస్తే.. 1990లో ఆ అటవీ భూమి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ప్రజలు ఆక్రమించుకున్నారని సర్వే చేయిస్తుంటాడు ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మురళి(కిశోర్‌ కుమార్‌). ఈ నేపథ్యంలో ఆ ఊరి యువకుడు శివ(రిషబ్‌ శెట్టి)కి , మురళికి గొడవలు జరుగుతాయి. తమకు అండగా రాజ వంశీకులు దేవేంద్ర దొర(అచ్యుత్‌ కుమార్‌) ఉంటాడని శివతో పాటు ఆ ఊరంతా నమ్ముతుంది. మరి దేవేంద్ర దొర ఏం చేశాడు? ఆ ఊరిలో కోలం ఆడే దేవ నర్తకుడు గురవను హత్య చేసిందెవరు? శివ కలలో కనిపించే ఆ రూపం ఎవరిది? అటవి భూమిని, దానిని నమ్ముకొని బతుకుతున్న ప్రజలను కాపాడడం కోసం దేవుడు ఏం  చేశాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
‘కాంతార’ కథ వింటే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. పూర్వీకులు ప్రజలకు ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వారసులు ప్రయత్నించడం.. దానిని అక్కడి ప్రజలు అడ్డుకోవడం.. చివరకు దేవుడు వచ్చి దుండగులను సంహరించడం ఇదే ‘కాంతారా’ కథ. వినడానికి ఇది పాత కథలా ఉన్నా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఆసక్తికరంగా సాగేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు రిషబ్‌ శెట్టి. హీరోలను, టెక్నీషియన్స్‌ కాకుండా కేవలం కథ, కథనాన్ని నమ్ముకొని తెరకెక్కించిన సినిమా ‘కాంతారా’.  

సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కథంతా కన్నడ ఫ్లేవర్‌లో సాగుతుంది. అయినప్పటికీ అన్ని ప్రాంతాల ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యే కథ ఇది. అడవి ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంటారు? వారి అలవాట్లు ఎలా ఉంటాయి? వేటాడే విధానం ఎలా ఉంటుంది? ఇలా ప్రతి అంశం కళ్లకు కట్టినట్లు చూపించారు. మొరటు ప్రేమ, కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. అయితే వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి సీన్స్‌ ఉండవు.. కథలో భాగంగా సాగుతాయి. దేవ నర్తకుడు కోలం ఆడే ప్రతి సీన్‌ ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నీవేశం చాలా నేచురల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌ వరకు ఇది సాధారణ సినిమానే. సెకండాఫ్‌ స్టార్టింగ్‌లో కొంత నెమ్మదిగా సాగుతుంది. కానీ క్లైమాక్స్‌ మాత్రం సినిమా స్థాయిని పెంచేస్తుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు రిషబ్‌ శెట్టి తన విశ్వరూపాన్ని చూపించాడు. థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి రిషబ్‌ శెట్టి ఒక్కడే అలా గుర్తిండిపోతాడు. 

Kantara Movie Cast In Telugu

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్‌ శెట్టి. దర్శకుడిగా, నటుడిగా వందశాతం న్యాయం చేశాడు. ఊరిలో అవారాగా తిరిగే యువకుడు శివ పాత్రలో రిషబ్‌ పరకాయప్రవేశం చేశాడు. ఆయన నటన సినిమా మొత్తం ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌ మరో ఎత్తు. ఆ సీన్‌లో రిషబ్‌ తప్ప మరొకరు అంతలా నటించలేరనేలా అతని నటన ఉంటుంది. కోలం అడుతున్నప్పుడు రిషబ్‌ అరిచే అరుపులు థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చాక కూడా మన చెవుల్లో మారుమ్రోగుతాయి.

ఇక ఫారెస్ట్‌ గార్డ్‌గా ఉద్యోగం సంపాదించిన గ్రామీణ యువతి లీలగా సప్తమి గౌడ తనదైన సహన నటనతో ఆకట్టుకుంది. రిషబ్‌, సప్తమిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. రాజ వంశీకుడు దేవేంద్ర దొరగా అచ్చుత్‌ కుమార్‌ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మురళిగా కిషోర్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర అద్భుతంగా నటించారు. 

Kantara Movie Rating And Photos

సాంకేతిక విషయానికొస్తే...ఈ సినిమాకు మరో ప్రధాన బలం అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం. కోలం ఆడే సమయంలో వచ్చే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.  విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని ప్రెజంట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3.25/5)
మరిన్ని వార్తలు