వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఇది!

26 Jan, 2021 08:45 IST|Sakshi

స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినా, గణతంత్ర దినోత్సవం వచ్చినా వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఒకటి ఉంది. అదే ‘కర్‌ చలే హమ్‌ ఫిదా జాన్‌ ఒ తన్‌ సాథియో.. అబ్‌ తుమ్హారే హవాలే వతన్‌ సాథియో’ పాట. ఇది 1964లో వచ్చిన ‘హకీకత్‌’ సినిమాలోని పాట. ధర్మేంద్ర, బల్‌రాజ్‌ సహానీ ప్రధాన తారాగణం. 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఆ యుద్ధం మీద వచ్చిన తొలి హిందీ సినిమా కూడా. లడాక్‌లో వొరిజినల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. చేతన్‌ ఆనంద్‌ దర్శకుడు. ఇండో చైనా వార్‌లో మనం ఓడిపోయాం. కాని ‘రెజాంగ్‌ లా’ అనే చోట 120 సైనికులు ఉన్న మన బృందం చైనా సైనికుల పై పైచేయి సాధించింది. అందులో 114 మంది మనవారు చనిపోయారు.

చైనా సైనికులు భారీగా చనిపోయారని అంటారు. మొత్తం మీద ఆ ఒక్క స్థలంలో మనవారు తమ బలిదానంతో భారత భూభాగాన్ని నిలుపుకోవడాన్ని కథగా తీసుకొని దర్శకుడు చేతన్‌ ఆనంద్‌ ‘హకీకత్‌’ తీశాడు. నిజానికి ఇది ప్రభుత్వం చెప్పాలనుకున్న ‘హకీకత్‌’ (వాస్తవం). చైనా యుద్ధానికి కారణం చైనా తప్పిదమే అనే నెహ్రూ అభిప్రాయానికి ప్రచారం ఇచ్చిన సినిమా ఇది. విశేషం ఏమిటంటే దేశభక్తి కలిగిన ఈ సినిమాలో పని చేసినందుకు వామపక్ష భావజాలం ఉన్న చేతన్‌ ఆనంద్, కైఫీ ఆజ్మీ, బల్‌రాజ్‌ సహానీ రూపాయి డబ్బు కూడా తీసుకోలేదు. దీని క్లయిమాక్స్‌లో గెలిచినా కూడా ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతదేహాల నేపథ్యంలో విషాద భరితంగా ఒక పాట కావాల్సి వచ్చింది. ఆ పాటను విజయ్‌ ఆనంద్‌ కైఫీ ఆజ్మీ చేత చేయించాడు. మదన్‌ మోహన్‌ దానికి బాణీ కట్టాడు.

కర్‌ చలే హమ్‌ ఫిదా జాన్‌ ఒ తన్‌ సాథియో
అబ్‌ తుమ్హారే హవాలే వతన్‌ సాథియో...

 

అంటే ‘మీ కోసం మా దేహప్రాణాలను బలిదానం చేశాం. దేశాన్ని మీకు అప్పగించి వెళుతున్నాం’ అని తోటి సైనికులకు, దేశప్రజలకు సైనికులు చెబుతున్నట్టుగా ఉండే పాట ఇది. ఐదు నిమిషాలకు పైగా వచ్చే ఈ పాట సినిమా సైనికుల మృతదేహాలను... నిజ సైనికశకటాలను చూపుతూ భావోద్వేగంగా ఉంటుంది. మహమ్మద్‌ రఫీ పాడిన విధానం శోకాన్ని, గగుర్పాటును, దేశభక్తిని కలిగించేలా ఉంటుంది. అందుకే ఆ పాట వచ్చి దాదాపు 60 ఏళ్లు అవుతున్నా నేటికీ వినపడుతూ ఉంది. అయితే ఈ సినిమా రిలీజుకు ముందే నెహ్రూ మరణించారు. ఈ సినిమాను నెహ్రూకు అంకితం ఇచ్చారు. ఎందరి బలిదానాలో ఈ దేశం మట్టిలో ఉన్నాయి. ఎందరి త్యాగాల ఫలితమో ఇది. అందరూ దీనికోసం ప్రాణాలు వొడ్డారు. ఈ దేశం అందరిది అనే భావనను పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భం ఇది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు