Karan Johar: అనుష్క శర్మ కెరీర్‌ నాశనం చేద్దామనుకున్న నిర్మాత.. అదే అతడి హాబీ అన్న కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌

6 Apr, 2023 18:31 IST|Sakshi

ఇన్‌సైడర్స్‌, అవుట్‌సైడర్స్‌ అంశంపై బాలీవుడ్‌లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆల్‌రెడీ సినీపరిశ్రమలో ఉన్న తారల వారసులకు ఇచ్చిన విలువ, హోదా.. బయట నుంచి వచ్చిన నటీనటులకు ఉండదనేది బలమైన వాదన. అంతేకాదు, దర్శకనిర్మాతలు కూడా సెలబ్రిటీల వారసులకే సినిమా అవకాశాలిస్తారు, కానీ ఎంత టాలెంట్‌ ఉన్నా సరే బయటవాళ్లను పట్టించుకున్న పాపాన పోరనే అపవాదు చిత్రపరిశ్రమలో ఉండనే ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారుతోంది.

అయితే బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ గతంలో అనుష్క శర్మ కెరీర్‌ను అంతం చేయాలనుకున్నాడట. ఆమెకు ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. కేవలం తన టాలెంట్‌తోనే స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి వచ్చింది. అలాంటి ఆమెను తక్కువ అంచనా వేసిన కరణ్‌ తనకు సినిమా అవకాశమే ఇవ్వకూడదని భావించాడట. ఈ విషయం స్వయంగా అతడే చెప్పాడు. 'రబ్‌నే బనాదీ జోడీ సినిమా కోసం అనుష్కను తీసుకుందామని ఆదిత్య చోప్రా ఆమె ఫోటో చూపించాడు. అది చూసిన నేను.. నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆమె వద్దే వద్దు.

తనకు ఈ సినిమా ఛాన్స్‌ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వేరే హీరోయిన్‌కు ఈ సినిమా ఇద్దామని ఉండేది. తెర వెనుక ఆమెను తప్పించే ప్రయత్నాలు చేశాను. సినిమా రిలీజయ్యాక అయిష్టంగానే చూశాను. కానీ బ్యాండ్‌ బాజా బారత్‌ మూవీ చూశాక తన నటనకు ఇంప్రెస్‌ అయ్యా. ఇంత మంచి టాలెంట్‌ ఉన్న హీరోయిన్‌ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలనుకున్నానన్న గిల్టీతో క్షమాపణలు చెప్పాను. సినిమా చాలా బాగా చేశావని అనుష్కను మెచ్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. 2016లో 18వ ఎమ్‌ఏఎమ్‌ఐ ముంబై ఫిలిం ఫెస్టివల్‌ కార్యక్రమంలో కరణ్‌ పై వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ఈ వీడియోను దర్శకరచయిత అపూర్వ అస్రానీ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 'కరణ్‌ జోహార్‌ అనుష్క శర్మ కెరీర్‌ను అంతమొందించాలని అనుకున్నట్లు కరణ్‌ జోహార్‌ గతంలో అంగీకరించాడు. నాకు తెలిసి ఇన్‌సైడర్‌, అవుట్‌సైడర్‌ అన్నది ఇప్పటికీ చర్చించాల్సిన అంశమే' అని ట్వీట్‌ చేశాడు. దీనిపై కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి స్పందిస్తూ.. 'మంచి కెరీర్‌ ఇవ్వడం లేదా అంతం చేయడమే కొందరి హాబీ. ప్రతిభావంతులైన బయటివారిపై కొందరు డర్టీ పాలిటిక్స్‌ చేయడం వల్లే బాలీవుడ్‌ ఇలా తయారైంది' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. కాగా అనుష్క శర్మ 'రబ్‌నే బనా దీ జోడీ' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఆమె తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది.

మరిన్ని వార్తలు