‘సుల్తాన్‌’ మూవీ రివ్యూ

2 Apr, 2021 14:06 IST|Sakshi

టైటిల్‌ : సుల్తాన్‌
జానర్ : యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌
నటీనటులు : కార్తీ, రష్మిక మందన్న, యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు తదితరులు
నిర్మాణ సంస్థ : డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్
నిర్మాతలు : య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు
దర్శకత్వం : బక్కియరాజ్‌ కణ్ణన్
సంగీతం :  వివేక్‌- మెర్విన్
ఎడిటర్‌: రూబెన్
సినిమాటోగ్రఫీ : స‌త్యన్‌ సూర్య‌న్
విడుదల తేది : ఏప్రిల్‌ 02,2021


తమిళ హీరో కార్తీకి టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. కార్తీ గత చిత్రం ‘ఖైదీ’ తెలుగులో డబ్‌ అయి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆయన ‘సుల్తాన్‌’గా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద హంగామా చేయడానికి వచ్చాడు. ‘ఖైదీ’, ‘దొంగ’ వంటి సూపర్‌ హిట్స్‌ తర్వాత కార్తీ నటించిన తాజా చిత్రం ఇది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు నిర్మించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్‌) కీల‌క పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన రావడంతో పాటు అంచనాలను కూడా పెంచాయి. మరి ఆ అంచనాలను ‘సుల్తాన్‌’ అందుకున్నాడా? కార్తీ, రష్మికా మందన్నా జంట ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.


కథ
విక్రమ్ సుల్తాన్(కార్తీ) ముంబైలోని ఓ కంపెనీలో రోబోటిక్ ఇంజనీర్‌. ఆయన తండ్రి సేతుపతి(నెపోలియన్‌)మాత్రం ఒక డాన్‌. తన దగ్గర కౌరవులుగా పిలవబడే 100మంది రౌడీలు ఉంటారు. సుల్తాన్‌కు మాత్రం రౌడీయిజం అంటే అసలు నచ్చదు. కానీ అనుకోని సంఘటన వల్ల ఆయన సోదరులుగా భావించే 100 మంది రౌడీల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సుల్తాన్‌ తన 100 మంది సోదరులతో కలిసి అమరావతిలోని వెలగపూడి గ్రామానికి వెళ్తాడు. అక్కడ రుఖ్మిణి(రష్మికా మందన్నా)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ అదే రుక్మిణి ఉన్న గ్రామానికి ఓ పెద్ద సమస్య ఉందని తెలుసుకొని, దానిని పరిష్కరిస్తాడు. అసలు ఆ గ్రామానికి ఉన్న సమస్య ఏంటి? 100 మంది బాధ్యతను సుల్తాన్‌ ఎందుకు తీసుకున్నాడు? కార్తీ తన కౌరవులతో ఏం చేశాడు? అనేదే మిగతా కథ.


నటీనటులు
ఎప్పుడూ ప్రయోగాత్మక కథలను ఎంచుకునే కార్తీ.. ఈ సారి కూడా ఓ విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. సుల్తాన్‌ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించాడు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. పల్లెటూరి అమ్మాయిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా అదరగొట్టింది. పూర్తి డీ గ్లామరైజ్డ్‌ పాత్ర ఆమెది. ఓ కొత్త పాత్రలో రష్మికను చూడొచ్చు. హీరో తండ్రి పాత్రలో నెపోలియ‌న్ తన అనుభవాన్ని చూపించాడు. విలన్ పాత్రలో 'కేజీఎఫ్‌' ఫేమ్ రామ్ ఫెర్ఫార్మెన్స్‌ బాగుంది. అలాగే మరో విలన్ నవాబ్ షా కూడా మంచి నటనను కనబరిచాడు. ఇక యోగిబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


విశ్లేషణ
మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపున కాకుండా కౌరవుల పక్షాన ఉంటే ఎలా ఉంటుంది? అనే ఒక చిన్న పాయింట్‌ తీసుకుని ‘సుల్తాన్‌’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్. వందమంది అన్నయ్యలు ఉన్న ఓ తమ్ముడి కథే ఈ చిత్రం. అయితే కాన్సెప్ట్‌ కొత్తగా ఉన్నా.. తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. రొటీన్ బ్యాక్ డ్రాప్‌నే నేటి తరానికి కావాల్సిన అంశాలు పెట్టి తెరపై చూపించినట్లు అనిపిస్తుంది.


ఫస్టాఫ్‌ మొత్తం ఫుల్‌ కామెడీగా నడిపించిన దర్శకుడు.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించాడు. అయితే సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటం ప్రేక్షకుడికి ఇబ్బందిగా అనిపిస్తుంది. 'కేజీఎఫ్‌' ఫేమ్‌ రామ్‌ లాంటి స్టార్‌ విలన్‌ ఉన్నప్పటికీ.. వారి పాత్రని బలంగా తీర్చిదిద్దలేకపోవడం ప్రతికూల అంశమే. కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లలో కూడా లాజిక్‌ మిస్‌ అవుతుంది. కానీ, కార్తీ, రష్మిక మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ అదిరిపోయాయి. తెరపై వారిద్దరి కెమెస్ట్రీ బాగా కుదురింది. వివేక్ – మెర్విన్‌ల పాటలు, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్‌ రూబెన్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Poll
Loading...
మరిన్ని వార్తలు