-

మోనిత ఇంటికి వెళ్లిన కార్తీక్‌, తాళి కట్టి భార్య స్థానం ఇవ్వమన్న మోనిత

17 Jun, 2021 15:46 IST|Sakshi

కార్తీకదీపం జూన్‌ 17: మోనిత దీప ఇంటికి వస్తుంది. దీప గొప్పది. పురాణాల్లో విన్నామే మహా పతివ్రతల గురించి.. అలాంటిది దీప. భర్త ఎలాంటి వాడైనా పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే పాతకాలం నాటి మనిషి.. భూదేవి అంత సహనం ఉంది కాబట్టి నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి పదేళ్లగా ఎదురు చూసింది.. కానీ నాకు అంత ఓపిక లేదందూ గోడ మీద 10 గీతలు గీసి అవి చూపిస్తూ.. పది రోజులు నీకు టైమ్ ఇస్తున్నాను.. పది రోజుల్లో నాకు న్యాయం జరిగే సమాధానం కావాలని లేదంటే నీ కుటుంబం గడగడ వణికిపోయేలా చేస్తానంటూ హెచ్చరిస్తుంది. 

ఇక మోనిత వెళ్లిపోతూ వెనక్కి తిరిగి ఎక్కువగా ఆలోచించకు దీప.. ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఏం లేదు.. ఆరోగ్యం బాగా చూసుకో.. ఎందుకంటే రేపు నాకు పురుడు పొయ్యాల్సింది నువ్వే.. పది మందికి అన్నం పెట్టిన చెయ్యి.. నీ చేత్తో పురుడు పోస్తే చాలా మంచిది అంటూ దిప ఉడికించి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం దీప దగ్గరకు వెళ్లి భర్త రాజీపడమని చెబుతానంటూ మురళీ కృష్ణతో చెబుతుంది. దీంతో అతను వద్దని భాగ్యంకు నచ్చజెప్పిన వినకుండా వెళ్తనని మొండిగా అంటుంది. ఇక పిల్లలు ఆడుకుంటూ మోనిత గీసిన గీతల దగ్గరకు వెళ్లి ఏంటవి అని మాట్లాడుకుంటుంటారు. మ్యాథమెటిక్స్‌ హా, ఆల్‌జిబ్రా గీతలు అంటూ వాళ్లు మాట్లాడుకుంటుంటే గుమ్మం దగ్గర నుంచి దీప, సోఫాలో కూర్చున్న కార్తీక్ వింటుంటారు. 

ఆ తర్వాత  పిల్లలు దీపని ‘ఇవి ఎవరు గీసారని అడగ్గా దీప కార్తీక్ వైపు చూస్తుంది. దాంతో పిల్లలు కార్తీక్‌ని నువ్వు గీశావా? నాన్న అని అడగ్గా... అవి నా భవిష్యత్ అమ్మ అంటాడు. దాంతో దీప కార్తీక్‌ తానో తప్పు చేశానని, నా భవిష్యత్‌కి సంబంధించింది. రేపు చెబుతాను అన్ని విషయం గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ చెబుతానన్న నిజం మోనిత ప్రెగ్నెంట్ విషయం అయ్యి ఉంటుందని, మోనిత ద్వారానే కార్తీక్ తన పతివ్రత అనే నిజాన్ని నమ్ముతున్నాడని ఆలోచిస్తూ బాధపడుతుంది. మొత్తానికి పిల్లలు కార్తీక్ చెప్పిన పెద్ద పెద్ద మాటలు అర్థం చేసుకోలేక.. ‘మన లెక్కలే బెస్ట్ అర్థమవుతాయి’ అనుకుంటూ వెళ్లిపోతారు.

ఇక సౌందర్య దీప, కార్తీక్‌ల గురించి దిగులు పడుతూ ఉండగా.. దీపకు బహుమతిగా ఇవ్వడానికి  కార్తీక్‌ గిఫ్ట్ పేపర్‌తో కవర్‌ చేసిన శ్రీశ్రీ పుస్తకం సౌందర్య కంటపడుతుంది. ‘దాన్ని తీసి పైన ఉన్న ‘దీపకు ప్రేమతో నీ డాక్టర్ బాబు’ అనేది చదివి.. ఓపెన్ చేసి.. అందులో ఉన్న పుస్తకం చూసి.. ‘అంటే ఈ గిఫ్ట్ వాడి చేతులతో దానికి ఇద్దాం అనుకున్నాడా..? ఎప్పుడు ఇద్దాం అనుకున్నాడు? ఎందుకు ఇవ్వలేదు?’ అని ఆలోచనలో పడుతుంది. బహుశా ఇదే ఆధారాన్ని కార్తీక్ ముందు ఉంచి కార్తీక్‌ని నిలదీస్తే.. దీప పవిత్రత అనే విషయం కార్తీక్‌కి ముందే తెలిసిందని బయటపడుతుంది. అప్పుడు దీప కార్తీక్ కాస్తైనా దగ్గరవుతారని ఆలోచిస్తుంది.

మరోవైపు కార్తీక్‌ మోనిత ఇంటికి వెళతాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తోంది మోనిత అని అంటాడు. ఏ విషయం అని అడుగుతుంది మోనిత. ‘అదే.. ఇంటికి వచ్చి పదిరోజులు గడువు ఇచ్చావు కదా అంటుండగా అందులో తప్పేముంది కార్తీక్‌ అంటుంది. ఆ తర్వాత కార్తీక్‌ మన మధ్య జరిగింది అది ప్రేమతోనో, ఇష్టంతోనో కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అలా అని ఏం తెలియనట్లు ఎలా ఉండమంటావని మోనిత అంటుంది. అలాగే దీప మీద ఉన్న ప్రేమతో ఇప్పుడు నాకు అన్యాయం చెయ్యాలని చూడకు కార్తీక్‌ అంటూ మోనిత రిక్వెస్ట్‌గా అడుగుతుంది. నా ఉద్దేశం అది కాదు అని కార్తీక్‌ అంటుండగా ‘నేను చెప్పిన మాటల్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవట్లేదు.. అందరి ముందు నా మెడలో తాళి కట్టి దీపకు ఇచ్చినట్లే నాకు భార్య స్థానం ఇవ్వు’ అంటుంది మోనిత. 

దీంతో కార్తీక్‌ మోనితా ప్లీజ్ అంటాడు ధీనంగా. తానేం తప్పు మాట్లాడలేదని ఎదురు తిరుగుతుంది మోనిత. అది కాదు మోనితా.. గత పదేళ్లుగా నా భార్యని నేను అనుమానించాను.. ఇప్పడు అది తప్పు అని తెలిసింది.. ఇప్పుడు ఈ టైమ్‌లో అని  అంటూ కార్తీక్‌ ఆగిపోతాడు. దీంతో ‘దానికీ నాకు సంబంధం ఏంటీ కార్తీక్.. నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? సారీ కార్తీక్ నా వల్ల కాదు అన్నీ నీకు అనుకూలంగా ఉండాలంటే నేను అన్యాయం అయిపోతాను.. ఏం కార్తీక్.. ఇప్పుడు దీప మీద ప్రేమ కలిగింది సరే.. మరి దీపకంటే ముందు నుంచే నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానే.. మరి నా మీద నీకెందుకు ప్రేమ కలగడం లేదు?’ అని కార్తీక్‌తో అంటుంది. 

మరిన్ని వార్తలు