‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫీలింగ్‌ మళ్లీ కలిగింది

19 Mar, 2021 00:48 IST|Sakshi

‘‘కథల ఎంపికలో నా జడ్జ్‌మెంట్‌ తప్పయి నా సినిమాలు కొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. హిట్‌ సినిమా కంటే ఫ్లాప్‌ సినిమానే ఎక్కువ నేర్పిస్తుంది’’ అని అన్నారు కార్తికేయ. కౌశిక్‌ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు.
 

► గీతా ఆర్ట్స్‌ నుంచి 2019లో ఫోన్‌ కాల్‌ వచ్చింది. చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. కథ వినడానికి దర్శకుడు కౌశిక్‌ను కలిశాను. కథ వినేప్పుడు చిన్న వయసులోనే దర్శకుడిగా కౌశిక్‌ ఇంత ఫిలాసఫీ ఎలా మాట్లాడగలుగుతున్నాడని షాక్‌ అయ్యాను. ఇందులో శవాలబండిని నడిపే బస్తీ బాలరాజు పాత్ర చేశాను. శవాన్ని తీసుకెళ్ల డానికి చావు ఇంటికి వెళ్లి, చనిపోయిన వ్యక్తి భార్యను ఇష్టపడతాడు బాలరాజు. ఆ తర్వాత జరిగే విషయాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి.

► మనం చావు అంటే చాలా భయపడిపోతాం. కానీ బతుకు ఇచ్చిన దేవుడే, చావును కూడా ఇచ్చాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఇలాంటి ఫిలాసఫీ బస్తీ బాలరాజు పాత్రలో ఉంటుంది. అందుకే ఈ పాత్రను మిస్‌ చేసుకోకూడదని ఓకే చెప్పాను. కామెడీ, ఎమోషన్స్‌ రెండూ మిళితమై ఉన్న సినిమా ఇది. ఈ సినిమా తర్వాత నాకు నెక్ట్స్‌ లెవల్‌ స్క్రిప్ట్స్‌ వస్తాయని నమ్ముతున్నాను. కొత్త దర్శకుడైన కౌశిక్‌ ఓ డిఫరెంట్‌ పాయింట్‌ను చక్కగా డీల్‌ చేశాడు.

► ప్రస్తుతం నేను ఉన్న పొజిషన్‌లో హిట్‌ అవసరమే. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా టైమ్‌లో నా చుట్టూ ఉన్న పాజిటివ్‌నెస్‌ను మళ్లీ ఇప్పుడు ‘చావుకబురు చల్లగా.. ’కి ఫీల్‌ అవుతున్నాను. ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సినిమాలు సెట్‌ చేసిపెట్టడానికి నాకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. కెరీర్‌ బిగినింగ్‌ స్టేజ్‌లో ఉన్నాను. తెలియనివి నేర్చుకుంటూ, చేసిన తప్పులు చేయకుండా ముందుకు సాగిపోతాను. నా వంతుగా సిన్సియర్‌గా కష్టపడతాను.

► నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో విలన్‌  రోల్‌ కొత్తగా ఉందనిపించి చేశాను. ఇప్పుడు అజిత్‌గారి తమిళ సినిమా ‘వలిమై’లో విలన్‌ గా చేస్తున్నాను. హెచ్‌. వినోద్‌ (‘వలిమై’ డైరెక్టర్‌)గారి ‘ఖాకీ’ సినిమా నాకు బాగా నచ్చింది. అందుకే ‘వలిమై’కి ఓకే చెప్పా. సుకుమార్‌ రైటింగ్స్‌లో ఓ సినిమా చేస్తున్నాను. 

>
మరిన్ని వార్తలు