ఇకపై అలాంటి కథలే ఎంచుకుంటా!

7 Nov, 2021 05:07 IST|Sakshi

– కార్తికేయ

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్‌గా పేరు వచ్చింది. కానీ, నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్‌ హిట్‌ మూవీ రాలేదు. ఇక నుంచి నన్ను ఇష్టపడేవారు గర్వపడేలా కథలు ఎంచుకుంటానని మాట ఇస్తున్నా’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ – ‘‘రాజా విక్రమార్క’ అనగానే చిరంజీవిగారు గుర్తొస్తారు. ఆయన అభిమానిగా ధైర్యం చేసి ఈ టైటిల్‌ పెట్టుకున్నాను. ‘రాజా విక్రమార్క’ సక్సెస్‌ అయితే శ్రీతో మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా సక్సెస్‌ నా కెరీర్‌కు ప్లస్‌ అవ్వడమే కాదు.. నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ నెల 21న లోహితతో నా పెళ్లి జరుగుతుంది’’ అన్నారు.

‘‘రాజా విక్రమార్క’ ట్రైలర్‌ చూడగానే కార్తికేయను అభినందించాను. ఇండస్ట్రీలోకి వచ్చేవారికి బ్యాక్‌గ్రౌండ్‌ అవసరం లేదు. టాలెంట్‌ ఉంటే చాలు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. ‘‘మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేద్దామనుకున్నాం.. కరోనా వల్ల రెండేళ్లు పట్టింది’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘‘కార్తికేయ వల్లే ‘రాజా విక్రమార్క’ నిర్మించే అవకాశం మాకు వచ్చింది’’ అన్నారు టి. ఆదిరెడ్డి. ‘‘కార్తికేయతో నా ప్రయాణం మూడేళ్ల క్రితం మొదలైంది’’ అన్నారు శ్రీ సరిపల్లి.

‘‘రాజా విక్రమార్క’ లో హీరోయిన్‌ తండ్రి పాత్ర పోషించాను’’ అన్నారు సాయికుమార్‌. ‘‘కార్తికేయలోని ఇన్నోసెన్స్‌ వల్ల ఎలాంటి పాత్ర అయినా చేయగలడు’’ అన్నారు హీరో సుధీర్‌ బాబు. ‘‘తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరూ మంచిగా మాట్లాడేది కార్తికేయ గురించే’’ అన్నారు హీరో విష్వక్‌ సేన్‌. ‘‘ఈ సినిమా హిట్‌ కావాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హీరో కిరణ్‌ అబ్బవరం, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ విహారి, పాటల రచయితలు కృష్ణకాంత్, సనారే, నటులు సుధాకర్‌ కోమాకుల, హర్షవర్ధన్‌ , నవీన్, ఎడిటర్‌ జస్విన్‌ ప్రభు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు