హౌస్‌ఫుల్‌ బోర్డ్‌తో హీరో.. తనకే టికెట్లు దొరకలేదని ట్వీట్‌

23 May, 2022 09:39 IST|Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌, బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ కియరా అద్వానీ నటించిన తాజా చిత్రం 'భూల్‌ భులయ్యా 2'. 2007లో వచ్చిన అక్షయ్‌ కుమార్‌ సూపర్‌ హిట్‌ సినిమా 'భూల్‌ భులయ్యా'కు సీక్వెల్‌గా తెరకెక్కింది ఈ మూవీ. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో వచ్చిన 'భూల్‌ భులయ్యా 2' మే 20న విడుదలైంది. హారర్‌ కామేడీగా వచ్చిన ఈ సినిమా మంచి విజయంతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ రావడంతో తనకే టికెట్లు దొరకట్లేదని ట్వీట్‌ చేశాడు హీరో కార్తీక్‌ ఆర్యన్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

'భూల్‌ భులయ్యా 2' సినిమా చూసేందుకు కార్తీక్‌ ఆర్యన్‌ ముంబైలోని గైటీ థియేటర్‌కు వెళ్లాడు. అక్కడ హీరోను చూసిన అభిమానులు అతడి వద్దకు గుంపులుగా చేరారు. తర్వాత అతను టికెట్లు కూడా పొందలేకపోయానని చెబుతూ హౌస్‌ఫుల్ బోర్డ్‌ ఫొటోను చూపించాడు. ''ఈ రోజు కోసం నటులుగా మేము ఎంతో కోరుకుంటాం. ఇది హౌస్‌ఫుల్‌ బోర్డ్. నేను కూడా టికెట్లు పొందలేకపోయాను. 'భూల్‌ భులయ్యా 2' ఆన్‌ ఫైర్‌. ప్రేక్షకులకు ధన్యవాదాలు.'' అని ట్వీట్ చేశాడు కార్తీక్.  

చదవండి: గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో

కాగా ఈ మూవీ సంజయ్‌ లీలా భన్సాలీ 'గంగూబాయి కతియావాడి', రణ్‌వీర్ సింగ్‌ 'జయేష్‌ భాయ్ జోర్దార్‌' సినిమాలను దాటి తొలి రోజు రూ. 14.11 కోట్లు రాబట్టి బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. రెండో రోజు రూ. 18.34 కోట్లు వసూళ్లు సాధించింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 32.45 కోట్లను కొల్లగొట్టింది. 

చదవండి: 20 కోట్ల రూపాయలిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా?

మరిన్ని వార్తలు