Vicky Kaushal Katrina Kaif Wedding: విక్ట్రీనా..వేడుకలు షురూనా

7 Dec, 2021 05:42 IST|Sakshi

పెళ్లి వేడుక ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని చాలామంది కోరుకుంటారు. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్‌ కత్రినా కైఫ్‌లు కూడా అలానే అనుకున్నట్లున్నారు. అందుకే తమ వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ ప్రేమికుల వివాహం రాజస్థాన్‌లో సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో జరగనుంది.

నేటి నుంచి 10వ తేదీ వరకు రాజస్థాన్‌లో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ జోడీకి ఫ్యాన్స్‌ పెట్టిన పేరు)ల వివాహ వేడుకలు జరగనున్నాయని బాలీవుడ్‌ టాక్‌. మంగళవారం సంగీత్, ఆ మర్నాడు మెహందీ, ఆ తర్వాత 9న విక్కీ–కత్రినాల వివాహం, 10న రిసెప్షన్‌ జరగనున్నాయట. కోటలో విక్కీకి ‘రాణా మాన్‌సింగ్‌’ పేరున్న సూట్‌ని, కత్రినాకు ‘రాణి పద్మావతి’ పేరున్న సూట్‌ని బుక్‌ చేశారని వినికిడి. ఒక్కో గది అద్దె రోజుకి  దాదాపు 7 లక్షల రూపాయలని సమాచారం.

సోమవారం వధూవరుల కుటుంబం ఫోర్ట్‌లో చెకిన్‌ అయ్యారు. 11న చెక్‌ అవుట్‌ అవుతారు. అలాగే అతిథుల కోసం కూడా విలాసవంతమైన గదులను బుక్‌ చేశారట. ఒక్కో గది అద్దె రోజుకి 70 వేల రూపాయలని టాక్‌. దాదాపు 120 మంది అతిథిలు ఈ వేడుకల్లో పాల్గొంటారని బాలీవుడ్‌ అంటోంది. పెళ్లికి హాజరయ్యేవారందరూ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకుని ఉండాలి లేదా ఆర్‌టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్ట్‌ చూపించాలి. అలాగే సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని కాబోయే వధూవరులు అతిథులకు విన్నవించుకున్నారట. వేడుకలకు హాజరయ్యేవారందరూ ప్రముఖులు కాబట్టి రక్షణ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని సుమారు వంద మంది బౌన్సర్లను నియమించారట. 

ఓటీటీలో పెళ్లి వేడుక: వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్ట్రీనాలను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్‌ చేసేందుకు ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ భారీ ఆఫర్‌తో విక్కీ, కత్రినాలతో సంప్రదింపులు జరిపిందని ప్రచారం జరుగుతోంది. అందుకే వేడుకలకు సంబంధించి ఒక్క ఫొటో కానీ, చిన్న వీడియో కానీ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా.

మాజీలకు ఆహ్వానం లేదు... మరోవైపు విక్ట్రినా పెళ్లికి హాజరయ్యే బాలీవుడ్‌ ప్రముఖల జాబితాలో కత్రినా మాజీ ప్రేమికులు సల్మాన్‌ ఖాన్, రణ్‌బీర్‌ కపూర్‌ పేర్లు ఉన్నాయా? లేవా? అసలు వీరికి ఆహ్వానాలు వెళ్లాయా? అనే చర్చ బాలీవుడ్‌లో జరుగుతోంది. కానీ తమకు ఆహ్వానం అందలేదని సల్మాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే విక్కీ మాజీ ప్రేయసి హర్లీన్‌ సేథీని కూడా ఆహ్వానించలేదని భోగట్టా. వివాహానికి వెళ్లే అతిథుల్లో ఆలియా భట్, కరణ్‌ జోహార్, కబీర్‌ ఖాన్, రోహిత్‌ శెట్టి, సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ, వరుణ్‌ ధావన్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు