Keerthi Suresh: రివాల్వర్‌ రీటాగా కీర్తి సురేశ్‌, ఆసక్తి పెంచుతున్న ఫస్ట్‌లుక్‌!

17 Jan, 2023 08:52 IST|Sakshi

నటి కీర్తి సురేష్‌ అనే పేరు వినగానే గుర్తొచ్చే చిత్రం మహానటి. సావిత్రినే మళ్లీ పుట్టిందా అనేంతగా ఆ చిత్రంలో అద్భుతంగా అభినయించారు ఆమె. అదేవిధంగా తమిళంలోనూ సాని కాగితం అనే చిత్రంలో మగజాతి వంచితురాలిగా, ప్రతీకారం తీర్చుకునే ఆడపులిగా నటించి నటిగా మరోసారి నిరూపించుకున్నారు. అయితే గ్లామర్‌ పాత్రల వైపు దృష్టి మళ్లించిన కీర్తి సురేశ్‌కు ఆ తరువాత చెప్పుకోదగ్గ పాత్రలు రాలేదనే చెప్పాలి. కెరీర్‌ ఆరంభంలో మంచి విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల వాటికి దూరమయ్యారని చెప్పక తప్పదు.

చదవండి: అది నా అదృష్టం: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

గత ఏడాది తెలుగులో మహేష్‌ బాబుతో జతకట్టిన సర్కారి వారి పాట, తమిళంలో సాని కాగితం చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక 2023 ఆమె చేతి నిండా ప్రజెక్ట్స్‌ బిజీగా ఉంది. నానికి జంటగా నటించిన తెలుగు చిత్రం ‘దసరా’ విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళాశంకర్‌’ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ సరసన నటించిన ‘మామన్నన్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జయంరవితో జత కట్టిన ‘సైరన్‌’ నిర్మాణంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు.

చదవండి: విజయ్‌ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్‌?

దీనికి ‘రివాల్వర్‌ రీటా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఫ్యాషన్‌ స్టూడియోస్, ది రూట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను పొంగల్‌ సందర్భంగా విడుదల చేశారు. రెండు చేతుల్లో రివాల్వర్లు పట్టుకున్న కీర్తి సురేష్‌ ఫొటోతో కూడిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే ఇది యాక్షన్‌ నేపథ్యంలో సాగే లేడీ ఓరియంటెడ్‌ కథాచిత్రంగా ఉంటుందనిపిస్తోంది. కాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంప్రదాయబద్ధంగా కీర్తి సురేష్‌ పొంగల్‌ వేడుకలను జరుపుకుంది. ఆ ఫొటోలను ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు.   

మరిన్ని వార్తలు