Keerthi Suresh: నా దృష్టిలో ఆ రెండూ కష్టం!

12 May, 2022 01:03 IST|Sakshi

– కీర్తీ సురేష్‌

కీర్తీ సురేష్‌ అంటే సంప్రదాయబద్ధమైన పాత్రలకు చిరునామా అన్నట్లు ఉంటారు. కానీ ఆర్టిస్ట్‌ అంటే అన్ని రకాల పాత్రలు చేయాలన్నది కీర్తి అభిప్రాయం. అందుకే ‘సర్కారువారి పాట’లో కళావతి పాత్ర అంగీకరించారు. ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై కనిపించనంత గ్లామరస్‌గా, మాస్‌గా ఈ సినిమాలో కనిపిస్తా’’ అంటున్నారు కీర్తి.

పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్‌ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్లపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదల సందర్భంగా కీర్తీ సురేష్‌ చెప్పిన విశేషాలు.

► ‘గుడ్‌ లక్‌ సఖి’, తమిళ చిత్రం ‘సాని కాయిదమ్‌’ (తెలుగులో ‘చిన్ని’), మధ్యలో ‘పెద్దన్న’లో రజనీకాంత్‌ చెల్లెలి పాత్ర. వీటికి భిన్నంగా ‘సర్కారువారి పాట’లో కనిపించడం గురించి?
‘సర్కారువారి పాట’లో మాస్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తాను. కాస్ట్యూమ్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. హెయిర్‌ స్టయిల్‌ కూడా భిన్నంగా ఉంటుంది. మేకప్‌ కొత్తగా ఉంటుంది. ఈ తేడా నాకు చాలా నచ్చింది. నాది సరదా పాత్ర. ఇప్పటివరకూ తెలుగులో చేసిన పాత్రలన్నింటికన్నా భిన్నంగా ఉంటుంది.

► అందుకేనేమో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘కళావతి..’ (‘సర్కారువారి పాట’లో కీర్తి పాత్ర) నాకు మంచి గిఫ్ట్‌ అన్నారు.
అవును. రేపు సినిమా చూశాక నాకు ఈ పాత్ర మంచి బహుమతి అని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. తమిళంలో చేశాను కానీ తెలుగులో ఇప్పటివరకూ ఇలాంటి మాస్‌ క్యారెక్టర్‌ చేయలేదు.

► మరి.. ‘మహానటి’ లాంటి భారీ పాత్ర చేసిన మీకు ‘కళావతి’లాంటి మాస్‌ క్యారెక్టర్‌ చేయడం ఈజీ అయ్యుంటుందనుకోవచ్చా?
లేదు. కళావతి కూడా చాలెంజింగ్‌ రోలే. ఈ పాత్రలో ఫన్‌ ఉంది. నా దృష్టిలో ఏడిపించడం, నవ్వించడం చాలా కష్టం. ఈ రెండూ పెద్ద సవాల్‌. పైగా డైలాగ్‌ డెలివరీ డిఫరెంట్‌గా ఉంటుంది. పరశురాంగారి హెల్ప్‌తో డబ్బింగ్‌ చెప్పాను. ఏ పాత్ర సవాల్‌ దానికి ఉంటుంది. ‘మహానటి’ సవాల్‌ ‘మహానటి’ది.. కళావతి సవాల్‌ కళావతిది. అంతే..

► ‘లవ్‌ ట్రాక్‌’ కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తారని మహేశ్‌బాబు అన్నారు...
సినిమాలో మా ఇద్దరి  కెమిస్ట్రీ బాగా కుదిరింది. కథతో పాటు ఈ ట్రాక్‌ ఉంటుంది. ఇలా లవ్‌ ట్రాక్‌ చేయడం నాకు ఫ్రెష్‌గా అనిపించింది.

► ఈ మధ్యే ‘చిన్ని’లో డీ గ్లామరస్‌గా కనిపించి, వారం తిరిగే సరికల్లా గ్లామరస్‌గా కనిపించడం గురించి..
‘చిన్ని’లో సాదా సీదా బట్టలు, చింపిరి జుట్టుతో, చెవికి పోగులు కూడా లేకుండా కనిపిస్తాను. ఆ సినిమా విడుదలై వారం అయింది. వెంటనే ‘సర్కారువారి పాట’లో ఆ పాత్రకు భిన్నంగా గ్లామరస్‌గా కనిపించనున్నాను. ఇలా వెంట వెంటనే రెండు పూర్తి భిన్నమైన పాత్రల్లో కనిపించడం అనేది పెద్ద సవాల్‌. ఇలాంటి చాలెంజ్‌లు నాకిష్టం.

► తమిళంలో మాస్‌ సాంగ్స్‌కి డాన్స్‌ చేశారు.. ఇప్పుడు ‘మ..మ.. మహేశా..’ పాటకు మాస్‌ స్టెప్స్‌ వేయడం ఎలా అనిపించింది?
ఈ పాట చాలా ఇష్టపడి చేశాను. ‘మ..మ.. మహేశా..’ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్‌ సాంగ్‌. థియేటర్‌ అదిరిపోతుంది.  సీట్లలోంచి లేచి మరీ ఫ్యాన్స్‌ డాన్స్‌ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మాస్‌ సాంగ్స్‌ తమిళ్‌లో చేశాను. తెలుగులో ఇదే ఫస్ట్‌ టైమ్‌.

► ‘మహానటి’తో అందరూ మిమ్మల్ని మహానటి అన్నారు. ‘సర్కారు వారి..’తో మాస్‌ హీరోయిన్‌ అంటారా?
ఏమో.. నిజానికి ‘మహానటి’కి చాన్స్‌ వచ్చినప్పుడు నేనలాంటి సినిమా చేయగలనని అనుకోలేదు... చేసేశా. ఇప్పుడు ‘సర్కారువారి..’లో మంచి మాస్‌ పాత్ర చేశాను. ఒక ఆర్టిస్ట్‌గా ఏ క్యారెక్టర్‌ వచ్చినా చేయాలి. అప్పుడే పరిపూర్ణత ఉంటుంది.

► ‘పెద్దన్న’లో రజనీకాంత్‌ చెల్లెలిగా, ఇప్పుడు ‘బోళా శంకర్‌’లో చిరంజీవి చెల్లెలిగా చేశారు. చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వస్తాయేమో అనే టెన్షన్‌ లేదా?
అలా ఆలోచించలేదు. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం సరి కాదనిపించింది. పైగా రజనీ సార్‌తో చాన్స్‌ దొరకడం కష్టం. అలాగే చిరంజీవి సార్‌తో. ఈ  పాత్రలను ఇష్టపడి చేశాను.     

మరిన్ని వార్తలు