గుండెపోటుతో దిగ్గజ నటుడి కన్నుమూత.. నాతోనే ఉంటాడంటూ మోహన్‌లాల్‌ భావోద్వేగం

27 Mar, 2023 07:37 IST|Sakshi

మలయాళ దిగ్గజ నటుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు ఇన్నోసెంట్‌(75) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా సంబంధిత శ్వాసకోశ సమస్యలతో పాటు పలు అవయవాలు దెబ్బతినడంతో.. మార్చి 3వ తేదీన కొచ్చి వీపీఎస్‌ లకేషోర్‌ ఆస్పత్రిలో ఆయన చేరారు. అయితే ఆదివారం గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్‌బులిటెన్‌ ద్వారా వెల్లడించాయి. 

మలయాళంలో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన ఇన్నోసెంట్‌.. ఎల్డీఎఫ్‌ మద్దతుతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో త్రిస్సూర్‌ చాలాకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గారు. అసోషియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌(అమ్మ)కు పదిహేనేళ్లపాటు అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. గతంలో క్యాన్సర్‌ బారిన పడిన ఆయన.. దానిని జయించడమే కాదు, క్యాన్సర్‌ వార్డులో నవ్వులు(Laughter in the Cancer Ward) పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాశారు. 

1972లో నృతశాల చిత్రం ద్వారా సిల్వర్‌ స్క్రీన్‌ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. సపోర్టింగ్‌రోల్స్‌తో పాటు విలన్‌గా, కమెడియన్‌ పాత్రలతో ఐదు దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించారు.  ఇన్నోసెంట్‌ నటించిన చిత్రాల్లో అక్కరే నిన్నోరు మారన్‌, గాంధీనగర్‌ సెండక్‌ స్ట్రీట్‌, నాడోడిక్కట్టు, రామోజీ రావు స్పీకింగ్‌, తూవల్‌స్పర్శమ్‌, డాక్టర్‌ పశుపతి, సందేశం, కేళి, దేవసూరం.. తదితర చిత్రాలు బాగా గుర్తుండిపోతాయి. కిందటి ఏడాది పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లీడ్‌ రోల్‌లో వచ్చిన కడువా చిత్రంలోనూ నటించారాయన. ఇన్నోసెంట్‌ చివరిసారిగా నటించిన చిత్రం పాచువుమ్‌ అత్భుథవిలక్కుమ్‌(ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా..) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

ఇన్నోసెంట్‌ మృతికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం సంతాపం తెలుపుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌లతో పాటు పలువురు సినీ తారలు అందులో ఉన్నారు. మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌సుకుమారన్‌లతో ఇన్నోసెంట్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది.

ఏం చెప్పను నా ఇన్నోసెంట్.. ఆ పేరు లాగే అమాయకంగా నవ్వులూ, ప్రేమా, ఓదార్పును ప్రపంచానికి పంచుతూ, చుట్టూ ఉన్నవాళ్లని తమ్ముడిలా పట్టుకుని, దేనికైనా నాతో ఉన్న.. నీ ఎడబాటు బాధని మాటల్లో చెప్పలేను. ప్రతి క్షణం ఆ అమాయకపు చిరునవ్వుతో, ప్రేమతో, మందలింపుతో నా ఇన్నోసెంట్ ఎప్పటికీ నాతో ఉంటాడు అంటూ మోహన్‌లాల్‌ తన ఫేస్‌బుక్‌ వాల్‌పై భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు. 

ఇదీ చదవండి: పవన్‌ కల్యాణ్‌ సినిమా కోసం నన్ను బతిమిలాడారు

మరిన్ని వార్తలు