kGF 2 Editor Ujwal: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్‌-2 ఎడిటర్‌

22 Apr, 2022 08:21 IST|Sakshi

‘పేరుకు తగ్గట్టే అతను చురుకైనవాడు.. పేరుకు తగ్గట్టే అతని భవిష్యత్తు ఉంటుంది’... ‘కేజీఎఫ్‌ 2’ చూశాక ‘ఉజ్వల్‌’ గురించి చాలామంది అన్న మాటలివి. ‘కేజీఎఫ్‌ 2’ విడుదల తర్వాత ఉజ్వల్‌ ఓ హాట్‌ టాపిక్‌. మరి.. పాన్‌ ఇండియా సినిమాకి 19ఏళ్ల కుర్రాడు ఎడిటర్‌ అంటే విశేషమే కదా. యశ్‌ హీరోగా ప్రశాంత్‌  నీల్‌ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్‌ 2’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసినవాళ్లు ఉజ్వల్‌కి ‘ఉజ్వల భవిష్యత్తు’ ఉంటుందని ప్రశంసిస్తున్నారు. ఇక ఎడిటర్‌గా ఉజ్వల్‌కి ‘కేజీఎఫ్‌ 2’ అవకాశం ఎలా వచ్చింది? తన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? అనే విషయాలను ‘సాక్షి’కి ఉజ్వల్‌ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం.. 

ముందుగా మీ కుటుంబం గురించి? 
ఉజ్వల్‌: నార్త్‌ కర్నాటకలోని గుల్బర్గాలో పుట్టి, పెరిగాను. మా నాన్న గోవింద్‌రాజ్‌ కులకర్ణి ఎల్‌ఐసీ ఆఫీసర్‌. అమ్మ రమ హౌస్‌వైఫ్‌. అక్క అనుశ్రీ ఎల్‌జీలో వర్క్‌ చేస్తోంది.
 
మరి.. చదువు సంగతి? 
పీయూసీ ఫస్ట్‌ ఇయర్‌లో డ్రాప్‌ అయ్యాను. 

ఎడిటర్‌ కావడానికేనా? 
యాక్చువల్‌గా క్రికెటర్‌ కావాలనేది నా కల. 

మరి.. ఎడిటింగ్‌ వైపు రావడానికి కారణం? 
నా కజిన్‌ వినయ్‌ యాక్టర్‌. తన కోసం షూటింగ్, ఎడిటింగ్‌ చేసేవాణ్ణి. అలా ఎడిటింగ్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టాను. నా ఆసక్తి తెలుసుకుని నా ఫ్రెండ్‌ శశాంక్‌ ఎడిటింగ్‌ సైడ్‌ ప్రోత్సహించాడు. తనే నన్ను బెంగళూరు రమ్మన్నాడు. నాకు బాగా హెల్ప్‌ చేశాడు. బెంగళూరు వెళ్లాక కొందరు టెక్నీషియన్స్‌ని కలిశాను. కన్నడ సినిమా ‘మఫ్తీ’ ఎడిటర్‌ హరీష్‌ కొమ్మె దగ్గర రెండు నెలలు పనిచేశాను.  

సో.. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేదన్నమాట? 
లేదు.. 

మరి... ‘కేజీఎఫ్‌ 2’కి అవకాశం ఎలా వచ్చింది?
యశ్‌ సార్, ప్రశాంత్‌ సార్‌కి నేను పెద్ద అభిమానిని. అలాగే ‘కేజీఎఫ్‌’కి కూడా. దాంతో ‘కేజీఎఫ్‌’ సినిమా విజువల్స్‌ని ఎడిట్‌ చేశాను. లక్కీగా ప్రశాంత్‌ సార్‌ ఆ విజువల్స్‌ చూశారు. ఆయనకు నచ్చాయి. ఆ తర్వాత నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు.. వెళ్లాను. ‘కేజీఎఫ్‌ 2’కి ఎడిటర్‌గా అవకాశం ఇచ్చారు. 

పాన్‌ ఇండియా సినిమా.. పెద్ద బడ్జెట్‌ కాబట్టి ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడు టెన్షన్‌ పడిన రోజులేమైనా? 
అలాంటి రోజలు లేవు. నిజానికి అవన్నీ గోల్డెన్‌ డేస్‌ అనాలి. ఎందుకంటే నా లైఫ్‌లో నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిన రోజులవి. 

ఇంత పెద్ద సినిమాకి అవకాశం వచ్చినప్పుడు మీ అమ్మానాన్న ఏమన్నారు? 
ఈ అవకాశం రాక ముందు మా అమ్మానాన్న బాగా టెన్షన్‌ పడేవారు. ఎందుకంటే నేనేమీ చేసేవాణ్ణి కాదు. అందుకే ‘కేజీఎఫ్‌’ ఆఫర్‌ గురించి చెప్పగానే వాళ్లు చాలా ఆనందపడ్డారు. ఇవాళ నేను ఏం సాధించినా అది నా పేరెంట్స్‌కే దక్కుతుంది. నేను ఇంత దూరం రావడానికి కారణం వాళ్లే. నన్ను చాలా బాగా సపోర్ట్‌ చేశారు.  

‘కేజీఎఫ్‌ 2’లో యంగెస్ట్‌ టెక్నీయన్‌గా యశ్, ప్రశాంత్‌ల నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించింది? 
ఆ ఇద్దరితో కలిసి పని చేస్తున్నానని నమ్మలేకపోయాను. వాళ్లిద్దరూ నా ముందు కూర్చుంటే నేను వాళ్ల కోసం పని చేయడం అనే ఆ ఫీల్‌ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ‘ఇంత చిన్న వయసులో ఎడిటింగ్‌ నేర్చుకున్నావా?’ అని యశ్‌ సార్‌ అడిగి, చాలా ఎంకరేజ్‌ చేశారు. ప్రశాంత్‌ సార్‌ ప్రతిదీ పక్కాగా ప్లాన్‌ చేస్తారు. ఆయన కథ చెప్పే విధానాన్ని, ఆయన ఆలోచనలను అర్థం చేసుకుంటే నా పని సులువు అవుతుంది. అలాగే చేశాను. ఒకవైపు షూట్‌ చేయడం.. మరోవైపు ఎడిట్‌ చేయడం రెండూ జరిగేవి. ఈ సినిమాకి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది.  

‘కేజీఎఫ్‌ 2’కి ఎడిటింగ్‌ పరంగా కష్టం అనిపించిన సన్నివేశాల గురించి...
‘ఇంటర్‌ కట్స్‌’ విషయంలో కాస్త కష్టం అనిపించింది. అంతకుముందు వాటి గురించి నాకు అవగాహన లేదు.  

ప్రస్తుతం ప్రభాస్‌తో ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్‌గా చేయమని అడిగారా? 
‘సలార్‌’కి వర్క్‌ చేయమని ప్రశాంత్‌ సార్‌ అన్నారు. అయితే నేను ఈ సినిమాకి సోలో ఎడిటర్‌గా చేస్తానా? అనే విషయం గురించి ఇప్పుడు నాకు తెలియదు. 

టెక్నికల్‌గా అప్‌డేట్‌ కావడా నికి ఇక్కడి సినిమాలు, వెబ్‌ సిరీ స్‌లతో పాటు విదేశీ చిత్రాలు కూడా చూస్తుంటారా? 
చూస్తాను. నాకు డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ అంటే చాలా ఇష్టం. ఆయనకు పెద్ద అభిమానిని. ఇక టీవీ సిరీస్‌లో ‘నార్కోస్‌’, ‘పీకీ బ్లైండర్స్‌’ బాగా నచ్చాయి. ముఖ్యంగా ‘పీకీ బ్లైండర్స్‌’ చాలా చాలా ఇష్టం. 

ఎడిటర్‌గా కంటిన్యూ కావడానికి చదువుకి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారా? భవిష్యత్‌ ప్రణాళికలు? 
ప్రస్తుతానికి అయితే నేను చదువు మీద దృష్టి పెట్టడంలేదు. కెరీర్‌ ఎలా వెళితే అలా ఫాలో అయిపోతాను. సినిమాల్లోనే ఉండాలనుకుంటున్నాను. 

మీరు కెమెరా వ్యూ చూస్తున్న ఫొటో ఉంది... ఫొటోగ్రఫీ నేర్చుకుంటున్నారా? 
లేదు. కానీ సినిమాకి సంబంధించిన ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటున్నాను. 

మరిన్ని వార్తలు