గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్‌ నీల్‌.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్‌

16 Aug, 2022 11:15 IST|Sakshi

‘కేజీయఫ్‌’ ఫేమ్‌  ప్రశాంత్‌ నీల్‌ గొప్ప మనసు చాటుకున్నాడు.  ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. తండ్రి 75వ జయంతిని(ఆగస్ట్‌ 15) పుర​స్కరించుకొని ప్రశాంత్‌ నీల్‌ ఈ భారీ విరాళాన్ని అందించారని మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ విషయాన్ని రఘువీరా రెడ్డి ఎందుకు ప్రకటించాల్సి అవసరమేంటి అనుకుంటున్నారా? ఈ కేజీయఫ్‌ డైరెక్టర్‌ ఎవరో కాదు.. రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్‌ రెడ్డి సొంత కుమారుడే. ప్రశాంత్‌ నీల్‌ పుట్టిపెరిగింది బెంగళూరులో అయినా.. అతని స్వంత గ్రామం మాత్రం అనంతపురం జిల్లా నీలకంఠాపురం. కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్‌నీల్‌ తండ్రి మరణించారు. నీలకంఠాపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అందుకే ప్రశాంత్‌ నీత్‌ తరచు ఈ గ్రామానికి వస్తుంటాడు.

(చదవండి: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటుడు సామ్రాట్‌ భార్య)

తండ్రి 75వ జయంతి సందర్భంగా సోమవారం తండ్రి సమాధిని దర్శించుకొని నివాళులు అర్పించిన ప్రశాంత్‌.. అనంతరం గ్రామంలో పర్యటించారు.  ప్రశాంత్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘. నాకు, నీలకంఠాపురం గ్రామం ప్రజలకు ఇది గర్వించే క్షణం. నా సోదరుడి కుమారుడు ప్రశాంత్ నీల్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి సరిగ్గా ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగష్టు 15న జన్మించారు’అని  రఘువీరా  ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు