రాఖీ బాయ్‌ ఈజ్‌ బ్యాక్‌

8 Oct, 2020 16:00 IST|Sakshi

కేజీఎఫ్‌ చాప్టర్‌-1 సినిమాతో కన్నడ హీరో యష్‌ ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.. అదేనండీ మన రాకీ బాయ్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 2018లో వచ్చిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రూ. 250 కోట్లకు పైగా కొల్లగొట్టి భారతీయ సినీ దృష్టిని ఆకర్షించింది. ఒక కన్నడ సినిమా స్టామినా ఈ రేంజ్‌లో ఉంటుందా అని చాటి చెప్పింది ఈ సినిమా. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సినిమా అక్టోబర్‌ 13 2020లోనే థియేటర్లకు రావాల్సి ఉండేది.


కానీ కరోనా వైరస్‌ విజృంభణతో 75శాతం పూర్తైన షూటింగ్‌ మార్చిలో ఆగిపోయింది. సరిగ్గా ఏడు నెలల తర్వాత ఈరోజే సినిమా చివరి దశ షూటింగ్‌ ప్రారంభమైంది. హీరో యష్‌ కూడా షూటింగ్‌లో పాల్గొనడానికి గురువారం లొకేషన్‌లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యష్‌కు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం ట్విటర్‌లో షేర్‌ చేశారు. గుబురు గడ్డంతో సముద్రం వైపు నిలబడి తీక్షణంగా చూస్తున్నట్టుగా యష్‌ కనిపిస్తాడు. ప్రమాదం జరగబోయే ముందు అలలు ఎంత నిశబ్దంగా ఉంటాయో యష్‌ చూపులు కూడా అలాగే ఉన్నాయి. రాఖీ బాయ్‌.. ఈజ్‌ బ్యాక్‌ అంటూ కాప్షన్‌ జత చేశారు. ఇక ఈ సినిమాలో అధీర పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తుండగా.. యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్‌ సినిమాకు కీలకమైన రమ్మికా సేన్‌ పాత్రలో నటిస్తోంది. రవీ బస్రూర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా  జనవరి 14 ,2021లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు