కేజీఎఫ్‌ 2 టీజర్‌ ఎఫెక్ట్‌: యశ్‌‌కు నోటీసులు

14 Jan, 2021 14:40 IST|Sakshi

బెంగళూరు: కేజీఎఫ్‌ 2 టీజర్‌ రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇక యూట్యూబ్‌లో కూడా కేజీఎఫ్‌ 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 48 గంటల్లోపే ఈ టీజర్‌ 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఈ రోజు వరకు యూట్యూబ్‌లో 147 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి రికార్డు సృష్టించింది. 2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తొలి భాగానికి పది రెట్లు అదిరిపోయేలా కేజీఎఫ్‌-2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. (చదవండి: కేజీఎఫ్‌ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!)

అయితే రికార్డులు సృష్టిస్తోన్న`కేజీఎఫ్-2` టీజర్ వల్ల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో యశ్‌ మాత్రం చిక్కుల్లో పడ్డారు. వీరికి కర్ణాటక స్టేట్‌ యాంటీ టొబాకో సెల్‌ నోటీసులు జారీ చేశారు. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశం. టీజర్ చివర్లో హీరో యశ్ గన్‌తో వరుసగా వాహనాలను షూట్ చేసి వచ్చి ఆ తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. ఆ సీన్ చూపించేటపుడు `యాంటీ స్మోకింగ్ వార్నింగ్` వేయకపోవడమే ఈ అభ్యంతరానికి కారణమట. దాంతో స్టేట్‌ యాంటీ టొబాకో సెల్‌ వారికి నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు