నాట్‌ దట్‌ కైండ్‌ ఆఫ్‌ గర్ల్‌: మర్మం తెలియని మనసుతో... 

7 Apr, 2021 08:48 IST|Sakshi

‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కియార అడ్వానీ ‘భరత్‌ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆమెకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి... నాట్‌ దట్‌ కైండ్‌ ఆఫ్‌ గర్ల్‌. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం.. అమెరికన్‌ యువనటి లీనా డనమ్‌  జ్ఞాపకాల సమహారం ఈ పుస్తకం. న్యూయార్క్‌కు చెందిన ఇద్దరు కళాకారుల కుమార్తె అయిన లీనాకు మీడియా దృష్టినే ఆకర్షించే నైపుణ్యం కొత్తేమీ కాదు.

పదకొండు సంవత్సరాల వయసులోనే ఆమె మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘టైనీ ఫర్నీచర్‌’తో సినిమారంగానికి పరిచయమైన లీనా డనమ్, దీనికి ముందు హెచ్‌బీవో ‘గర్ల్స్‌’ సిరీస్‌ కోసం రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఫిల్టర్‌ లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మాటలు జనాలకు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ పుస్తకం కూడా అలాంటి కోవకు చెందిందే. ‘ర్యాండమ్‌ బుక్‌హౌజ్‌’ ఈ పుస్తకానికి భారీ మొత్తం చెల్లించింది. ‘ఈమెతో పోల్చితే చేయితిరిగిన రచయిత్రులు ఎంతోమంది ఉన్నారు. భారీ మొత్తం ఎందుకు చెల్లించారు?’ అనే ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. ఒకటి... ఆమె సెలబ్రిటీ కావడం. రెండు... ఎవరూ రాయడానికి ఇష్టపడని విషయాలు లేదా జ్ఞాపకాల గురించి రాయడం.

అమెరికన్‌ రచయిత, ప్రచురణకర్త హెలెన్‌ గ్రూలీ బ్రౌన్‌ పుస్తకం ‘సెక్స్‌ అండ్‌ ది సింగిల్‌ గర్ల్‌’కు ‘నాట్‌ దట్‌ కైండ్‌ ఆఫ్‌ గర్ల్‌’ అనుకరణ అంటారు చాలామంది. 1962లో బ్రౌన్‌ రాసిన ‘సెక్స్‌ అండ్‌ ది సింగిల్‌ గర్ల్‌’ సంచలనం సృష్టించింది. లైంగికస్వేచ్ఛ గురించి ఈ పుస్తకంలో రాసింది. మరో పుస్తకం ‘హ్యావింగ్‌ ఇట్‌ ఆల్‌: లవ్, సక్సెస్‌. సెక్స్, మనీ’ కూడా సంచలనమే. ‘నాట్‌ దట్‌ కైండ్‌ ఆఫ్‌ గర్ల్‌’లో ఒకచోట ‘హ్యావింగ్‌ ఇట్‌ ఆల్‌’ పుస్తకం ప్రస్తావన, విశ్లేషణలు కనిపిస్తాయి. ‘ఇరవై ఏళ్ల వయసులో నాకు నేను నచ్చేదాన్ని కాదు. నా జట్టు నాకు నచ్చేది కాదు. నా ముఖం నాకు నచ్చేది కాదు’ అంటుంది ఒకచోట. ఇక భయాల విషయానికి వస్తే... తలనొప్పి నుంచి కుష్టువ్యాధి వరకు పాల నుంచి ల్యాంప్‌ డస్ట్‌ వరకు... ఎన్నో భయాలు ఉండేవి.

తొలినాళ్లలో టెక్నాలజీని ధ్వేషించడం, చెల్లి పుడితే ‘ఆమెను వెనక్కి పంపించండి’ అనడం...ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ అభద్రత, స్వీయధ్వేషం స్థానంలో ఆతరువాత కాలంలో తనను తాను ప్రేమించుకునే వైఖరి పెరిగింది. అకారణ భయాల స్థానంలో తనలో తాను ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పడం మొదలైంది. ‘శక్తిమంతమైన వాళ్లు, ఆత్మవిశ్వాసం గల వాళ్లు పుట్టరు. తయారవుతారు’ అనే వాక్యం ఆకట్టుకుంటుంది. ‘లవ్‌ అండ్‌ సెక్స్‌’ ‘ఫ్రెండ్‌షిప్‌’ ‘బాడీ’ ‘వర్క్‌’ బిగ్‌ పిక్చర్‌’ ...ఇలా పుస్తకాన్ని అయిదు భాగాలుగా విభజించవచ్చు. ‘15 థింగ్స్‌ ఐ హ్యావ్‌ లెర్న్‌డ్‌ మై మదర్‌’ ‘థెరపీ అండ్‌ మీ’ ‘మై రిగ్రెట్స్‌’ ‘జాయ్‌ ఆఫ్‌ వేస్టింగ్‌ టైమ్స్‌’ ‘మై మదర్‌ ఇన్వెంటెడ్‌ సెల్ఫీ’ ‘యో-యో డైటింగ్‌’ ‘డైట్‌ ఈజ్‌ ఏ ఫోర్‌-లెటర్‌ వర్డ్‌’...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. 

‘లగ్జరీ గొప్పదే కావచ్చుగానీ క్రియెటివిటీ అంతకంటే గొప్పది’లాంటి వాక్యాలు ఆకట్టుకుంటాయి. ఎప్పుడో శేషజీవితంలో చెప్పుకోవాల్సిన విషయాలు ఈ వయసులో చెప్పుకోవడం ఏమిటి? అనే ప్రాథమిక సందేహం చాలామందికి రావచ్చు. అయితే మనసు విప్పి చెప్పడానికి నిర్దిష్టమైన ‘టైమ్‌’ అంటూ ఒకటి ఉంటుందా! ఈ పుస్తకంలో ఆమె సంతోషమే సర్వస్వం అనుకునే ‘సెల్ఫ్‌-ఇన్‌డల్‌జెంట్‌’గా కనిపించవచ్చు. కానీ ఇందులో ఆమె పశ్చాత్తాపం కూడా చదవొచ్చు. ఆమె ఎదుర్కున్న అవమానల గురించి తెలుసుకోవచ్చు. ‘నాట్‌ దట్‌ కైండ్‌ ఆఫ్‌ గర్ల్‌’  మనకు నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. కానీ ఒక జెనరేషన్‌ వాయిస్‌గా గుర్తించడంలో విభేదించాల్సింది పెద్దగా లేకపోవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు