King Of Kotha Review: ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ మూవీ రివ్యూ

24 Aug, 2023 13:54 IST|Sakshi
Rating:  

టైటిల్‌: కింగ్‌ ఆఫ్‌ కొత్త
నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌, ఐశ్వర్య లక్ష్మి, షబీర్‌ కళ్ళరక్కల్‌, అనిఖా సురేంద్రన్, నైలా ఉషా, షాహుల్ హసన్, గోకుల్ సురేశ్ తదితరులు
నిర్మాణ సంస్థలు:  జీ స్టూడియోస్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌
దర్శకత్వం: అభిలాష్‌ జోషి
నేపథ్య సంగీతం: జాక్స్‌ బిజోయ్‌
పాటలు : షాన్‌ రెహమాన్‌, బిజోయ్‌
సినిమాటోగ్రఫీ: నిమేష్‌ రవి 
విడుదల తేది: ఆగస్ట్‌ 24, 2023

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్‌ సల్మాన్‌.. తనదైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. మలయాళ హీరో అయినప్పటికీ మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. తాజాగా దుల్కర్‌ నటించిన చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్‌ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 


‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’కథేంటంటే..
ఈ మూవీ కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్‌కి చెందిన రాజు(దుల్కర్‌ సల్మాన్‌) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. అనుకున్నట్లే పెద్ద రౌడీ అయి కోతా టౌన్‌ని తన గుప్పింట్లోకి తెచ్చుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్‌)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్‌లోనే స్నేహితుడు కన్నా(షబీర్‌ కళ్లరక్కల్‌)తో కలిసి వేరుగా ఉండేవాడు. స్వతాహా ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ అయిన రాజు.. ఆ ఏరియాలో ఎక్కడ పోటీలు నిర్వహించిన తన గ్యాంగ్‌తో కలిసి పాల్గొనేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్‌ అనేది లేకుండా చేస్తాడు.

ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. దీంతో అతని గ్యాంగ్‌ అంతా వేరు వేరు ప్రాంతాలకు వెళ్లిపోతారు. కొన్నాళ్లకు కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్‌గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్‌ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. ఆ ఏరియా పోలీసు అధికారులు సైతం కన్నాభాయ్‌కి భయపడతారు. అయితే ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్‌ని మట్టుపెట్టిన సీఐ శావుల్‌(ప్రసన్న) కోతాకి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. కన్నాభాయ్‌కి చెక్‌ పెట్టేందుకై రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? పదేళ్ల పాటు రాజు ఎక్కడికి వెళ్లాడు? అక్కడ ఏం చేశాడు? కన్నాభాయ్‌ ఆగడాలకు రాజు ఎలా చెక్‌ పెట్టాడు? ప్రాణంగా ప్రేమించిన తారకు రాజు ఎందుకు దూరమయ్యాడు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్‌ ఆఫ్‌ కోతా’చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
గ్యాంగ్‌స్టర్స్‌ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. దానికి కారణం కథ, కథనం కొత్తగా ఉండడం. ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’లో అసలు కొత్తదనం అనేదే లేదు. అవే కత్తి పోట్లు.. తుపాకుల తూట్లు.. వెన్నుపోట్లు.  కథ పరంగా ఎక్కడా కొత్తగా అనిపించదు కానీ కథనం మాత్రం కాస్త వెరైటీగా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆ విషయంలో పూర్తిగా సక్సెస్‌ కాలేదు. ఈ చిత్రంలో మదర్‌ సెంటిమెంట్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌తో పాటు ప్రేమ, స్నేహ బంధం..ఇలా అన్ని అంశాలు ఉన్నాయి . కానీ వాటిని ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా చూపించడంలో డైరెక్టర్‌ విఫలం అయ్యాడు.

ఈ మూవీ కథ కోత అనే పట్టణంలో జరుగుతుంది. (కొత్త అంటే మలయాళంలో టౌన్‌ అని అర్థం. అదొక ఫిక్షనల్‌ టౌన్‌. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్‌లో కోతా అని వాడారు ) ప్రారంభమవుతుంది. కోతా పట్టణానికి కొత్తగా వచ్చిన సీఐ శావుల్‌కి అక్కడి ఎస్సై టోని.. రాజు, కన్నాల ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పడం ప్రారంభించినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఫుట్‌బాల్‌ పోటీకి సంబంధించిన సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఇక తారతో రాజు ప్రేమాయణానికి సంబంధించినసన్నివేశాలు రొటీన్‌గా సాగుతుంది. రంజియ్‌ భాయ్‌ పాత్ర మాట్లేడే ఇంగ్లీష్‌ నవ్వులు పూయిస్తుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌లో కథ ఏమీ ఉండదు.. అలా సాగిపోతుంది అంతే.

ఇక ఇంటర్వెల్‌ సీన్‌ తర్వాత సెకండాఫ్‌ ఎలా ఉండబోతుందనేది ఈజీగా అర్థమవుతుంది. రాజు తిరిగి కోతాకి రావడం.. కన్నాభాయ్‌ మనుషులపై దాడి చేయడం..ఇలా రొటీన్‌గా కథ సాగుతుంది. ఇక క్లైమాక్స్‌కి అరగంట ముందు వరుసగా ట్విస్టులు ఉంటాయి. కాని అవి బోరింగ్‌ అనిపిస్తాయి. ఇక సినిమా ముగుస్తుందిలే అని అనుకున్న ప్రతిసారి మరో మలుపు రావడం.. సాగదీతగా అనిపిస్తుంది. ఇక దర్శకుడిని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే.. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకోవడం. 

ఎవరెలా చేశారంటే..
దుల్కర్‌ సల్మాన్‌ గ్యాంగ్‌స్టర్‌గా చేయడం ఇదే తొలిసారి. అయినప్పటికీ తనదైన నటనతో గ్యాంగ్‌స్టర్‌ రాజు పాత్రకి న్యాయం చేశాడు. యాక్షన్స్‌ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక దుల్కర్‌ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర షబిర్‌ది. కన్నా అలియాస్‌ కన్నాభాయ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. రెండు డిఫరెంట్‌ వేరియషన్స్‌ ఉన్న పాత్ర తనది. ఇక గ్యాంగ్‌స్టర్‌ రాజు ప్రియురాలు తారాగా ఐశ్వర్య లక్ష్మీ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరో సోదరి రీతూగా అనిఖా సురేంద్రన్ తన పాత్రకు న్యాం చేసింది. సీఐ శావుల్‌గా ప్రసన్న, ఎసై టోనీగా గోకుల్‌ సురేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం  జేక్స్ బిజోయ్. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. బీజీఎం కారణంగా కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. నిమేష్‌ రవి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2/5)
మరిన్ని వార్తలు