Kirrak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్‌కు తాళం.. ఆర్పీ ఏమన్నాడంటే?

2 Jan, 2023 14:43 IST|Sakshi

కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ ఇటీవల నెల్లూరు చేపల పులుసు పేరిట ఓ కర్రీపాయింట్‌ను ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే కదా! నెల్లూరు స్పెషల్‌ వంటలను అందించడమే ఇక్కడి ప్రత్యేకత. కర్రీ పాయింట్‌ను అలా ఓపెన్‌ చేశాడో లేదో విపరీతమైన ఆదరణ లభించింది. దుకాణానికి కస్టమర్ల తాకిడి ఎక్కువవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయి ప్రజలు ఇబ్బందిపడ్డారు కూడా! ఊహించని సంఖ్యలో ప్రజలు కర్రీపాయింట్‌కు తరలిరావడంతో అందరికీ సమయానికి కర్రీ పార్శిల్‌ చేయడం కష్టమైపోయింది. భారీ లాభాలు వస్తున్నప్పటికీ అందరికీ సరిగ్గా టైమ్‌కు అందించలేకపోతున్నానన్న బాధతో ఏకంగా షాప్‌నే మూసేసి కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పాడు ఆర్పీ.

ఈ విషయం గురించి ఆర్పీ మాట్లాడుతూ.. 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్‌కు తాకిడి ఎక్కువైంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వారికి సరైన సమయానికి కూరలు అందించలేకపోతున్నాం. అందుకే నెల రోజులకే ఆ షాప్‌ మూసేశాను. ముందుగా కిచెన్‌ కెపాసిటీని పెంచి షాప్‌లో మార్పుచేర్పులు చేద్దామనుకుంటున్నా. ఆ తర్వాతే తిరిగి దుకాణం ప్రారంభిస్తా. షాప్‌ మూసేసిన విషయం తెలియక వందలమంది జనాలు వస్తున్నారు. అందరికీ ఈ సందర్భంగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇకపోతే నెల్లూరు చేపల పులుసు బాగా వండే మహిళలను హైదరాబాద్‌ తీసుకొచ్చి వారితో వండిస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది. అందుకని నెల్లూరులో ఆడిషన్స్‌ పెట్టి బాగా వండే మహిళలను సిటీకి తీసుకొస్తా. త్వరలోనే తిరిగి భారీ స్థాయిలో కర్రీపాయింట్‌ ఓపెన్‌ చేస్తా' అని చెప్పుకొచ్చాడు ఆర్పీ.

చదవండి: వంద కోట్లకు చేరువలో ధమాకా, మేకింగ్‌ వీడియో రిలీజ్‌
న్యూఇయర్‌ ఈవెంట్‌లో బుల్లితెర నటుడికి గాయం

మరిన్ని వార్తలు