Meter Movie Review: 'మీటర్' మూవీ రివ్యూ

7 Apr, 2023 15:46 IST|Sakshi
Rating:  

టైటిల్: మీటర్ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, ధనుష్ పవన్ 
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు :చిరంజీవి ( చెర్రీ), హేమలత పెదమల్లు 
దర్శకుడు : రమేష్ కడూరి 
సంగీతం : సాయి కార్తీక్ 
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్
విడుదల తేది: ఏప్రిల్ 07, 2023

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2019లో రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్‌. ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథ అంటూ అలరించిన ఈ యంగ్‌ హీరో మరోసారి 'మీటర్‌'తో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చాడు. కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన 'మీటర్' ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు రమేశ్ కడూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే..
అర్జున్ కల్యాణ్( కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ కానిస్టేబుల్. వెంకటరత్నం కానిస్టేబుల్‌గా ఎంతో నిజాయితీగా పనిచేస్తుంటాడు. అందువల్ల డిపార్ట్‌మెంట్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. తన కుమారున్ని ఎప్పటికైనా ఎస్సైగా చూడాలనేదే ఆయన కోరిక. కానీ హీరోకు పోలీస్ జాబ్ చేయడం ఇష్టముండదు. కానీ అనూహ్యంగా ఎస్సై జాబ్‌కు సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరుతాడు. ఎప్పుడెప్పుడు జాబ్‌ మానేయాలా? అని  ఎదురుచూసే అర్జున్‌కు ఊహించని విధంగా మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు వస్తుంది.

అదే సమయంలో అబ్బాయిలంటేనే ఇష్టం లేని అతుల్య రవితో అతడికి పరిచయం ఏర్పడుతుంది. అబ్బాయిలంటేనే గిట్టని అమ్మాయిని మన హీరో ఎలా పడగొట్టాడు?ఇష్టంలేని పోలీస్ జాబ్‌లో కొనసాగాడా? హోం మినిస్టర్ కంఠం బైరెడ్డి (ధనుశ్ పవన్)తో హీరోకు వివాదం ఎందుకు మొదలైంది? హోం మినిస్టర్‌తో ఉన్న వివాదం నుంచి అర్జున్ కల్యాణ్ ఎలా బయటపడ్డాడు? మరి చివరికి తండ్రి ఆశయాన్ని హీరో నెరవేర్చాడా? లేదా? అన్నదే అసలు కథ.  

కథనం ఎలా సాగిందంటే..
కథ విషయానికొస్తే హీరో బాల్యంతో కథ మొదలవుతుంది. చిన్నతనంలోనే ఎస్సై కావాలన్న తండ్రి కోరికను కాదనలేడు.. అలా అని ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఈ రెండింటి మధ్యలో హీరో నలిగిపోతుంటాడు. ఇష్టం లేకపోయినా ఎస్సై కావడం, ఆ మధ్యలో హీరోయిన్ అతుల్య రవితో పరిచయం రొటీన్‌గా అనిపిస్తుంది. పోలీస్ కమిషనర్‌గా పోసాని కృష్ణమురళి, హీరోకు మామగా సప్తగిరి కామెడీ ఫస్ట్ హాఫ్‌లో నవ్వులు పూయిస్తాయి. హోం మినిస్టర్‌ కంఠం బైరెడ్డితో అర్జున్‌ కల్యాణ్‌కు వివాదం రొడ్డకొట్టుడులా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ముందు ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. అలా ఫస్టాఫ్ ముగుస్తుంది.

సెకండాఫ్‌లో కథను అదే కోణంలో తీసుకెళ్లాడు డైరెక్టర్ రమేశ్. కథలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. హీరోకు, విలన్‌కు మధ్య సీన్స్ సాదాసీదాగా ఉంటాయి. క్లాస్‌కు భిన్నంగా కిరణ్‌ అబ్బవరాన్ని మాస్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలాగే తండ్రి, కుమారుల మధ్య ఎమోషనల్ ఎలిమెంట్స్‌ కాస్త పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలన్న హోంమినిస్టర్‌ కంఠం బైరెడ్డితో.. హీరో మధ్య జరిగే సన్నివేశాల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. క్లైమాక్స్‌ కూడా ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు. కథలో చాలా సన్నివేశాలు లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం డైలాగ్ డెలివరీతో పర్వాలేదనిపించాడు. కామెడీ సన్నివేశాల పరంగా డైరెక్టర్ ఓకే అనిపించాడు. పక్కా కమర్షియల్ మూవీ అయినా ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు విఫలమైనట్లు కనిపిస్తోంది.

ఎవరెలా చేశారంటే..
హీరో కిరణ్ అబ్బవరం క్లాస్‌కు భిన్నంగా ప్రయత్నించాడు. మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతుల్య రవి తన గ్లామర్, పాటలతో అదరగొట్టింది. సప్తగిరి తన కామెడీతో మరోసారి అలరించాడు. పోసాని కృష్ణమురళి పోలీస్ కమిషనర్‌ పాత్రలో కామెడీ చేస్తూ అదరగొట్టాడె. విలన్‌గా ధనుశ్ పవన్‌ ఫర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు బాగానే చేశారు. దర్శకుడు రమేశ్ కథపై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గుట్టుగా ఉన్నాయి. సాయి కార్తీక్  సంగీతం పర్వాలేదు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ కార్తీక శ్రీనివాస్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది.

Rating:  
(2/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు