ఏరువాక సాగాలో.. రన్నో చిన్నన్నో..

7 Mar, 2021 10:57 IST|Sakshi

సినీ పరివారం

నాన్న పాటలకు గాలి కూడా సడి సేయదు
ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నో.. 
ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే...
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి.. 
సడి సేయకోగాలి సడిసేయబోకే..
ఓ బాటసారీ నను మరువకోయి... 
నీ సుఖమే నే కోరుతున్నా..
వెన్నెలరేయీ ఎంతో చలీచలీ.. ఈ పగలు రేయిగా వెండి వెన్నెలగ మారినదేమి చెలీ..
లెక్క లేనన్ని సుమధుర గీతాలను అందించారు మద్దూరి వేణుగోపాల్‌..
ఆయనే మాస్టర్‌ వేణు.. 

పాతాళభైరవి లో హేమండ్‌ ఆర్గాన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌  మ్యూజిక్‌ చేసి, పండితుల చేత ఔరా అనిపించుకున్నారు.
సంగీతంలో ఎంత ఘనులో, అల్లరిలోనూ అంతే సమానులు అంటున్నారు హోలీ ఏంజెల్స్‌ స్కూల్‌లో మ్యూజిక్‌ టీచర్‌గా పనిచేసిన వారి పెద్దకుమారుడు మద్దూరి వెంకట సుబ్రహ్మణ్యమూర్తి ఉరఫ్‌ మూర్తిచందర్‌.

ఆ వివరాలు వారి మాటలలోనే..
నాన్నగారు బందరులో 1920 –22 మధ్యకాలంలో పుట్టారు. సరిగ్గా ఏ సంవత్సరమో తెలియదు. తాతగారు మద్దూరి సుబ్బయ్య నాయుడు, నాయనమ్మ గంగమ్మలకు నాన్నగారు ఒక్కరే సంతానం. తాతగారిది కలంకారీ అచ్చులు వేసే, మధ్యతరగతి కుటుంబం. నాన్నగారికి ఎనిమిది సంవత్సరాల వయసులోనే తాతగారు పోయారు. నాన్నగారిని వారి మావయ్యగారైన హనుమకొండ వెంకట్రామయ్య పెంచి, పెద్ద చేసి, వారి అమ్మాయితో నాన్న వివాహం జరిపించారు. ఆవిడ చాలా త్వరగా కన్నుమూయటంతో మా అమ్మను రెండో వివాహం చేసుకున్నారు. మేం ఇద్దరం మగపిల్లలం. నా పేరు మద్దూరి వెంకట సుబ్రహ్మణ్య మూర్తి. తమ్ముడికి భానుచందర్‌ అని పేరు పెట్టి, నన్ను మూర్తి చందర్‌గా మార్చారు. తమ్ముడు సినిమాలలో నటిస్తున్నాడు. 

గదిలో పది గంటల సాధన..
మొదటి భార్య తమ్ముడిని మా అమ్మ తన సొంత తమ్ముడిలా చూసింది. నాన్నగారి మేనమామ హార్మోనియం వాయించేవారు. మా తాతగారు పోవటంతో ఆయనే నాన్న బాధ్యతను తీసుకుని, కఠినమైన క్రమశిక్షణతో పెంచారు. నాన్న అల్లరి పనులు చేసేవారు. నాన్నను ఒక గదిలో పెట్టి తాళం వేసి, రోజుకి పది గంటలు బయటకు రాకుండా హార్మోనియం సాధన చేయించేవారు. లోపల నుంచి హార్మోనియం శబ్దం వినపడకపోతే వేళ్ల మీద కొట్టేవారు. నాన్నకు ఆటలంటే ఇష్టం. ఆడుకుని వచ్చి దెబ్బలు తినేవారు. పదకొండు సంవత్సరాలకే హార్మోనియం మీద పట్టు వచ్చి, మచిలీపట్నంలో పెద్ద పెద్ద వారందరికీ వాయించారు. పైడ్‌పైపర్‌ కథలో ఎలుకల్లాగ అందరూ నాన్నని చుట్టుముట్టి పాడించుకునేవారు. 

ముంౖ»ñ  పారిపోయారు..
టీన్‌ ఏజ్‌ వచ్చాక, హిందీ సినిమా పాటలు ఇష్టపడ్డారు. ఒకరోజు తన అదృష్టం వెతుక్కుంటూ ముంబై వెళ్లిపోయి, వసంతదేశాయ్‌ దగ్గర హార్మోనిస్టుగా చేరారు. అప్పుడు నాన్న వయసు 20 సంవత్సరాలు. అక్కడ కొంతకాలం పనిచేశాక, మద్రాసు హెచ్‌ఎంవిలో చేరారు. ఆ రోజుల్లో ప్రైవేట్‌ రికార్డ్సు పబ్లిష్‌ చేసేవారు. అక్కడ గాయకులకు పాటలు నేర్పి, రికార్డు చేయటం నాన్న పని. ఆ రోజుల్లోనే వైజయంతిమాల నాన్నగారి సంగీతంలో రెండు పాటలు పాడారు. హెచ్‌ఎంవి నుంచి విజయ స్టూడియోలో స్టాఫ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేరి, రికార్డింగ్, బ్యాక్‌ గ్రౌండ్‌ చేసేవారు. మాయాబజార్, పాతాళభైరవి చిత్రాలలో బ్యాక్‌ గ్రౌండ్‌స్కోర్, హేమండ్‌ ఆర్గాన్‌ని నాన్నగారు మాత్రమే హ్యాండిల్‌ చేశారు. ఆ పియానోని ఇండియాలో నాన్నగారే మొదట వాడారు. ‘రోజులు మారాయి’ చిత్రంలోని ‘ఏరువాక సాగాలో’ పాటకు ఎస్‌.డి. బర్మన్‌ చాలా ఇన్‌స్పయిర్‌ అయ్యి, ఆయన తన సినిమాలో ఈ పాటను పెట్టుకున్నారట.

మారలేకపోయారు..
1960 నుంచి సుమారు 12 సంవత్సరాలు నాన్‌స్టాప్‌గా పనిచేశారు నాన్న. ఆ పన్నెండు సంవత్సరాలు ఆయనతో చాలా అరుదుగా గడిపేవాళ్లం. క్రమేపీ సంగీత విలువలు పడిపోతుండటంతో నెమ్మదిగా ఫేడ్‌ అవుట్‌ అయిపోతూ వచ్చారు. అప్పటి నుంచి మాతో ఎక్కువకాలం గడిపారు. విశ్రాంతి సమయం దొరకటంతో ప్రతిరోజూ పియానో లేదా సితార్‌ రెండు గంటలు తప్పనిసరిగా వాయించుకునేవారు. మాకు టి. నగర్‌లో పెద్ద ఇల్లు ఉండేది. మా అమ్మ శకుంతల వల్లే ఆ ఇల్లు నిలబడింది. నాన్నకి ఆదాయం తగ్గినప్పుడు, ఇల్లు అద్దెకు ఇచ్చి, డబ్బు జాగ్రత్త చేసేది. ‘అమ్మా! నీకు మేమిద్దరం కాదు, నాన్న మూడో కొడుకుతో సమానం’ అనేవాడిని. కొందరు సంగీతకారులు మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భోజనం పెట్టి, ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు. 


(ఎడమ నుంచి కుడి) మూర్తి చందర్, భానుచందర్‌ 

చాలా చిలిపి..
నాన్నలో ఉన్న చిలిపితనం, పసితనం.. చివరి రోజుల వరకు చూశాం. నాన్నతో మేం స్నేహితుల్లా ఉండేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లు సైలెంట్‌గా, చిన్నవాళ్లు చురుకుగా ఉంటారు. నేను డల్‌గా ఉండటం వల్ల అమ్మనాన్నలకి బెంగగా ఉండేది. నా మీద రెట్టింపు ప్రేమ చూపించేవారు. ప్రతి శుక్రవారం నాన్న, నేను ఇంగ్లీషు సినిమాకి వెళ్లేవాళ్లం. కాలేజీకి వచ్చేసరికి నాకు, తమ్ముడికి ఇద్దరికీ సంగీతం వచ్చింది. కాని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలలో పెట్టాలనుకున్నారు. మామిడిచెట్లు మామిడి పళ్లనే ఇస్తాయి. మా ఇద్దరికీ సంగీతం మీద ఆసక్తి ఆగలేదు. తమ్ముడు భానుచందర్‌ నాన్నగారి ఆర్కెస్ట్రాలో గిటార్‌ వాయించేవాడు. మన సంప్రదాయ సంస్కృతి సంగీతంలో ఉండాలి అనేవారు. ఆ విషయం ఇప్పుడు అర్థం అవుతోంది.. సంపూర్ణమైన భోజనం పాత పాటలే అని. 

స్టూడియోలో సింహమే...
ఏ పూర్వజన్మ సుకృతమో కానీ, నాన్న అన్నిరకాల వాద్యపరికరాలు వాయించేవారు. రికార్డింగ్‌ స్టూడియోలోకి వెళితే సింహంలా చాలా క్రూరంగా ఉండేవారు. ఎవరు తప్పు చేసినా ఒక టీచర్‌లా వాళ్లని కొట్టి, వాద్యపరికరం లాగేసుకుని ఆయనే వాయించేసేవారు. ‘మావారి మంచితనం’ చిత్రంలో ఎన్‌టిఆర్‌ జయప్రదలకు ఒక పాట చేశారు. ఆ పాట విన్న జయప్రద సితార్‌ తెచ్చుకుని, నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్నారు. 

ఇద్దరూ నా దగ్గరే..
నాన్నకి చెట్లంటే ఇష్టం. రూఫ్‌ గార్డెన్‌ చేశారు. ధ్యానం, తోటపని.. వీటితో చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఇంటి వ్యవహారాలు అమ్మ చూసుకునేది. 

మాతో ఆడేవారు..
 ఒకసారి ఎన్‌టిఆర్‌ అమ్మతో, ‘అమ్మా! మాస్టర్‌గారు ఏం చేస్తున్నారు?’ అని అడిగితే, సినిమాలు లేక ఖాళీగా ఉన్నారని చెప్పింది. అప్పుడు ఆయన తీస్తున్న ‘మావారి మంచితనం’ సినిమాకు సంగీతం చేసే అవకాశం ఇచ్చారు. అదే నాన్న చేసిన ఆఖరి సినిమా. ఆ సినిమా పాటల రికార్డింగ్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుని, అక్కడ నుంచి వస్తూ మాకు చరఖా, గాలిపటాలు తెచ్చి, మాతో సమానంగా ఎగరేశారు. బొంగరాలు, గోళీలు బాగా ఆడేవారు. గోళీ కొడితే పగలాల్సిందే. అందరితోటీ పరాచికాలాడేవారు. కొలీగ్స్‌కి తొడపాశం పెట్టడం ఆయనకు ఇష్టం. ఘంటసాల గారికి కూడా పెట్టారు. నాన్నగారిని చూసి బాలు కూడా తొడపాశం ప్రారంభించారు.

కళ్లల్లో నీళ్లు ఆగలేదు..
పి. పుల్లయ్య, శాంతకుమారి దంపతులు నాన్నని ‘ఏరా అబ్బాయి’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. నాన్నకు క్యాన్సర్‌ వచ్చిందని తెలిసి ఆయన ఏడు పదుల వయసులో మూడు అంతస్తులు ఎక్కి నాన్నను చూసి వెళ్తూ, మెట్ల మీద కూలబడిపోయి, గట్టిగా ఏడ్చేశారు. రక్తసంబంధం లేకపోయినా అంత ప్రేమగా ఉండేవారు. నాన్న క్యాన్సర్‌తో 1981లో, అమ్మ 1991లో పోయారు. అమ్మకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో డ్రెస్సింగ్‌ చేసేటప్పుడు నేను అమ్మ పక్కనే ఉండటానికి నాకు అనుమతి ఇచ్చారు. ‘ఆడపిల్ల లేని లోటు తీర్చావు’ అని ఆప్యాయంగా అంది అమ్మ. అమ్మానాన్న నా చేతుల్లోనే పోయారు. 

మా తాతయ్య గారికి అమ్మ వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. వాళ్లు సంగీతం నేర్చుకోవటానికి వచ్చేవారు. అప్పటికి అమ్మకి పాతికేళ్లు. నాన్నగారు చాలా అందంగా ఉండేవారు. అమ్మ సైలెంట్‌గా లవ్‌ చేసి, ఎక్స్‌ప్రెస్‌ చేయలేదేమో అనుకుంటాను. అమ్మ దగ్గర ఉండి మరీ నాన్న పెళ్లి చేయించింది. చివరకు అమ్మకు ప్రేమ దక్కింది అనుకుంటాను. అదొక మిస్టరీ. అమ్మ నాన్‌వెజ్‌ వంటకాలు బాగా చేసేది. ఆవిడ పొద్దున్న మార్కెట్‌కి వెళ్లి ఫిష్‌ తెచ్చి, పసుపు వేసి బాగా తోమి, మసాలాలు వేసి మధ్యాహ్నం రెండు గంటలకు వంట పూర్తి చేసేది. పది నిమిషాలలో భోజనం పూర్తి చేసేసేవాళ్లం. ‘అమ్మ ఐదు గంటలు వంట చేస్తే, మనం ఐదు నిమిషాలలో పూర్తి చేసేస్తాం’ అని సరదాగా అనేవాడిని. ఆ విషయం నాన్న అందరికీ చెప్పేవారు. పాన్, పొగాకు నమలటం ఆయనకు ఇష్టం.
- మూర్తి చందర్‌ (మాస్టర్‌ వేణు పెద్ద కుమారుడు)

సంభాషణ: వైజయంతి పురాణపండ
 

మరిన్ని వార్తలు