Korukonda Gopi Krishna Facts: ఓటీటీలో హిట్‌ కొట్టిన అనకాపల్లి డైరెక్టర్‌, ఇంతకీ ఆయనెవరో తెలుసా?

22 Jun, 2022 16:25 IST|Sakshi
వాడే–వీడు షూటింగ్‌ పర్యవేక్షిస్తున్న దర్శకుడు గోపీకృష్ణ

సాక్షి, మునగపాక (అనకాపల్లి): సినిమా రంగంపై ఆసక్తితో అందరిలా అతను భాగ్యనగరానికి పరుగులు తీయలేదు. తనకున్న పరిమిత వనరులను ఉపయోగించుకుని తొలుత ‘వేదన’, ‘ఓ మనస్సు కథ’, ‘మత్తు వదలరా’ వంటి పలు లఘు చిత్రాలను జీరో బడ్జెట్‌తో తీసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆపై ఓటీటీ చిత్రం వాడే–వీడు తీసి 7 లక్షలకుపైగా వీక్షకుల అభిమానం పొందాడు. వెండితెర వైపు అడుగులు వేస్తున్న వర్ధమాన దర్శకుడు కోరుకొండ గోపీకృష్ణ స్ఫూర్తిదాయక కథనం...

మునగపాక గ్రామానికి చెందిన కోరుకొండ గోపీకృష్ణ చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి చూపేవాడు. సాహిత్యంపై మక్కువతో పలు కవితలు, రచనలు చేశారు. వెయ్యికిపైగా సన్మాన పత్రాలు రాసి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పుస్తకాలు రాసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి అభినందనలు అందుకున్నాడు.  

నూతన నటీ నటులతో వాడే–వీడు...
తార క్రియేషన్స్‌ బ్యానర్‌పై నూతన నటీనటులతో వాడే–వీడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. స్త్రీ లేనిదే ప్రతీ మగవాడి జీవితం శూన్యం. అదే స్త్రీ కారణంగా మగవాడి జీవితం శూన్యం కాకూడదనే ఇతి వృత్తాంతంతో సినిమా తీశాడు. హీరో హీరోయిన్లుగా సిరి, వెన్నెలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ.. స్థానిక కళాకారులు 15 మందితో సినిమా రూపొందించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 24 రోజుల పాటు వాడ్రాపల్లి, కొండకర్ల ఆవ, తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు.

అలరించిన పాటలు...
వాడే–వీడు చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలై ఉర్రూతలూగిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాటలకు విశేష ఆదరణ వస్తోంది. సింగర్‌ కార్తీక్‌ పాడిన వెన్నెల సాంగ్‌ రంజింపచేస్తోంది. ఈస్ట్‌వెస్ట్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ఈనెల 13న విడుదలైన చిత్రం అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా వీక్షించారు. ఐఎండీబీ 9 రేటింగ్‌ చేపట్టింది.

తెర వెనుక...
తారా క్రియేషన్స్‌ బ్యానర్‌పై వాడే–వీడు చిత్రానికి బ్రహ్మానందరెడ్డి, శ్రీపతి శివకుమార్‌ నిర్మాతలుగా, ఎంఎల్‌ రాజా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, కెమెరామెన్‌గా హేమవర్ధన్‌రెడ్డి వ్యవహరించారు. సింగర్‌ కార్తీక్, స్ఫూర్తి జితేందర్, లక్ష్మీ శ్రావణి తదితరులు పాటలు పాడారు. మాటల రచయితగా మునగపాకకు చెందిన విల్లూరి జగ్గప్పారావు, రచనా సహకారం సూరిశెట్టి రాము అందించారు.

పరుచూరి అభినందన
విశాఖ సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం. కళాకారులను ప్రోత్సహించేందుకు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. విశాఖను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల నెరవేరే రోజులు కనిపిస్తున్నాయి. వాడే– వీడు సినిమా చూసిన రచయిత పరుచూరి అభినందించారని గోపాలకృష్ణ తెలిపాడు.

చదవండి: సినీకార్మికుల సమ్మెపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
 చైతూ డేటింగ్‌ గాసిప్స్‌.. అప్పుడు ‘మజిలీ’ బ్యూటీ.. ఇప్పుడు ‘మేజర్‌’ భామ

మరిన్ని వార్తలు