ఆ చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు: తమిళ స్టార్ హీరో

7 Sep, 2022 18:23 IST|Sakshi

పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం ఘనత అంతా దర్శకుడు మణిరత్నంకు చెందుతుందని జయంరవి అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో మద్రాస్‌ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. జయం రవి టైటిల్‌ పాత్రలో నటించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, శరత్‌కుమార్, పార్తీపన్, ప్రకాÙరాజ్, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్‌ ప్రభు, పలువురు ప్రములు నటిస్తున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణంను అందించారు. రెండు భాగాలుగా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తొలి భాగం ఈ నెల 30వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా జయంరవి మంగళవారం ఉదయం చెన్నైలో పాత్రికేయులతో ముచ్చటించారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు.

సినిమాలో నటించాలని మణిరత్నం అడిగినప్పుడు తాను ఆ పాత్రకు న్యాయం చేయగలనా? అనే సందేహం కలిగిందని, ఆపై అంతకు మించి సంతోషం కలిగిందన్నారు. మంచి నటులను కూడా భిన్నంగా నటింపచేయగల దర్శకుడు మణిరత్నం అని అన్నారు. బేసిక్‌ ఎమోషన్‌ మైండ్‌లో ఉంచుకోమని, దానిని డైలాగ్‌లోనో, బాడీ లాంగ్వేజ్‌లోనో చూపించాల్సిన అవసరం లేదని, నటనలో ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయని సూచించారని వెల్లడించారు. పొన్నియిన్‌ సెల్వన్‌లో నటించడం వరం అన్నారు. చంద్రలేఖ తరువాత అంత స్టాండర్డ్‌తో రూపొందిన చిత్రం ఇదేనని తన భావన అన్నారు.

కోలీవుడ్‌లో యుద్ధంతో కూడిన చిత్రాలు రావాలన్నది తన ఆశ అన్నారు. ఈ చిత్రంలో టైటిల్‌ పాత్ర చేయడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. అయితే దర్శకుడు మణిరత్నం తనకు ఆరు నెలల ముందే గుర్రపు స్వారీ, యువరాజుకు తగ్గ బాడీకి తయారవ్వాలని ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చారన్నారు. పొన్నియిన్‌ సెల్వన్‌ నవల రెండు భాగాలు చదివానన్నారు. ఆ లోపు ఈ చిత్ర స్క్రిప్ట్‌ వచ్చిందన్నారు. దాంతో ఆ నవలను చదవడం నిలిపేశానన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో రాజరాజచోళన్‌ అంటే శివాజీ గణేశన్‌ అని పేర్కొన్నారు. అందుకే తాను దాని జోలికి పోకుండా పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్ర స్కి్రప్ట్‌ను ఫాలో అయి నటించాను. ఈ చిత్రం మణిరత్నం వల్లే సాధ్యమైందన్నారు. రెండు భాగాలను 150 రోజుల్లో పూర్తి చేయగలిగారన్నారు. చిత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పారు.   

చదవండి: Fact Check: తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్‌ రచ్చ... అసలు నిజాలు ఇవే

మరిన్ని వార్తలు