సీనియర్‌ నటి రీఎంట్రీ.. ఐటెం సాంగ్స్‌ అయినా ఒకే అట

7 Oct, 2022 09:17 IST|Sakshi

తమిళసినిమా: నటిగా, శృంగార తారగా 1980 ప్రాంతంలో ఊపేసిన తార బబిత. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో 150కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన నాయగన్‌ చిత్రంలో నాన్‌ సిరిత్తాల్‌ దీపావళి పాట వినగానే గుర్తొచ్చేది నటి బబిత పేరే. తెలుగులోనూ మొరటోడు నా మొగుడు వంటి పలు చిత్రాల్లో నటించారు. కె.భాగ్యరాజ్‌ హీరోగా నటించిన చిన్నవీడు చిత్రంలో ఆయనకు రెండో భార్యగా నటించి అలరించారు.

ఈమెది సినీ కుటుంబం అనే చెప్పాలి. ఈమె తండ్రి జస్టిస్‌ ఎంజీఆర్‌కు పలు చిత్రాల్లో విలన్‌గా నటించడంతో పాటు నిజ జీవితంలోనూ ఆయనకు నీడలా నిలిచిన వ్యక్తి. ఇక బబిత భర్త ఫైట్‌ మాస్టర్‌గా పలు చిత్రాలకు పని చేశారు. కాగా వివాహ అనంతరం నటి బబిత నటనకు దూరంగా ఉండి పిల్లలతో బాధ్యత గల తల్లిగా నడుచుకున్నారు. కొన్నేళ్ల క్రితం తన పెద్ద కూతురు లక్ష్యను హీరోయిన్‌ చేస్తూ స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించారు. అయితే అనివార్య కారణాలతో ఈ చిత్రం పూర్తి కాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తరువాత బబిత నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ నటిగా ఎంత పేరు తెచ్చుకున్నా సినిమా రంగంలో సాంబార్‌ ఇడ్లీ తినకపోతే ఉండలేకపోతున్నానన్నారు. అందుకే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యా నని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహల్‌ అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. దీనికి పొస్‌ కుమరస్‌ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. మళ్లీ శృంగార తారగా ఐటమ్‌ డాన్స్‌ చేయడానికి కైనా.. అక్క, అమ్మ పాత్రలకైనా సిద్ధమని ప్రకటించారు.

మరిన్ని వార్తలు