ఓటీటీలో మొదటి బ్లాక్‌బస్టర్‌ మా ‘నిశ్శబ్దం’

20 Sep, 2020 03:04 IST|Sakshi
కోన వెంకట్

‘‘ఇండియా – పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ స్టేడియంలో చూడటం ఒక కిక్‌. అలా కుదరకపోతే టీవీలో చూస్తాం. కరెంట్‌ పోతే ఫోన్‌లో చూస్తాం. కానీ ఉత్కంఠ ఒక్కటే. ఎమోషన్‌ కనెక్ట్‌ అయితే ఏ స్క్రీన్‌ అయినా ఒక్కటే. సినిమా కూడా అంతే’’ అన్నారు రచయిత కోన వెంకట్‌. అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో  నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్‌ 2న అమేజాన్‌ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాకి స్క్రీన్‌ ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్‌ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు.

మూకీ టు టాకీ
‘నిశ్శబ్దం’ని ముందు మూకీ  సినిమాగా అనుకున్నాం. స్క్రీన్‌ ప్లే కూడా పకడ్బందీగా ప్లాన్‌ చేశాం. కానీ అనుష్క పాత్ర ఒక్కటే వినలేదు... మాట్లాడలేదు.. మిగతా పాత్రలు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? అనే లాజికల్‌ క్వశ్చన్‌తో మూకీ సినిమాను టాకీ సినిమాగా మార్చాం.

రచయితగా నాకూ సవాల్‌
దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ ఈ కథ ఐడియా చెప్పగానే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఐడియాను కథగా మలిచి స్క్రీన్‌ ప్లే చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మేమిద్దరం మంచి మిత్రులం కావడంతో వాదోపవాదనలు చేసుకుంటూ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచాం.

షూటింగ్‌ ఓ పెద్ద ఛాలెంజ్‌
ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే పూర్తి చేశాం. అది కూడా కేవలం 60 రోజుల్లోనే. కానీ అలా చేయడానికి చాలా ఇబ్బందులుపడ్డాం. థ్రిల్లర్‌ సినిమా షూట్‌ చేయడానికి వాతావరణం కీలకం. అమెరికాలో శీతాకాలంలో తీయాలనుకున్నాం. మా అందరికీ వీసాలు వచ్చేసరికి అక్కడ వేసవికాలం వచ్చేసింది. రోజూ ఉదయాన్నే రెండుమూడు గంటలు ప్రయాణం చేసి లొకేషన్స్‌కి వెళ్లి షూట్‌ చేశాం.

వేరే దారిలేకే ఓటీటీ
‘నిశ్శబ్దం’ చిత్రం రిలీజ్‌ ఫి్ర» వరి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు థియేటర్స్‌ ఎప్పుడు తెరుచుకుంటాయో అయోమయం. మరీ ఆలస్యం చేస్తే కొత్త సినిమా చుట్టూ ఉండే హీట్‌ పోతుంది. అది జరగకూడదని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఓటీటీకి వెళ్లకూడదని చాలా విధాలుగా ప్రయత్నించాం. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇలా చేస్తున్నాం. కచ్చితంగా థియేటర్‌ అనుభూతి ఉండదు. కానీ సినిమా తీసిందే ప్రేక్షకుల కోసం. వాళ్లకు ఎలా అయినా చూపించాలి కదా. ఓటీటీలో ‘నిశ్శబ్దం’ మొదటి బ్లాక్‌బస్టర్‌ అవుతుంది అనుకుంటున్నాను.

ఫలితాన్ని దాచలేం
థియేట్రికల్‌ రిలీజ్‌ అయితే కలెక్షన్స్‌ని బట్టి సినిమా హిట్, ఫ్లాప్‌ చెప్పొచ్చు. ఓటీటీలో అలా ఉండదు. ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. బావుంటే అభినందనలు ఉంటాయి. లేదంటే చీల్చి చండాడేస్తారు. ఈ లాక్‌డౌన్‌ను నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. లాక్‌డౌన్‌ తర్వాత మనం చెప్పే కథల్లో చాలా మార్పు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. కచ్చితంగా కొత్త ఐడియాలు మన తెలుగులోనూ వస్తాయి. ‘నిశ్శబ్దం’ కూడా అలాంటి సినిమాయే అని నా నమ్మకం.

కోన 2.0 వస్తాడు
► లాక్‌డౌన్‌లో కొన్ని కథలు తయారు చేశాను
► లాక్‌డౌన్‌ తర్వాత అందరిలోనూ కొత్త వెర్షన్‌ బయటకి వస్తుంది అనుకుంటున్నాను. అలానే కోన వెంకట్‌ 2.0 కూడా వస్తాడు
► కరణం మల్లీశ్వరి బయోపిక్‌ సినిమా బాగా ముస్తాబవుతోంది
► దేశం మొత్తం ఆశ్చర్యపడే కాంబినేషన్‌ ఒకటి ఓకే అయింది. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను
► సంక్రాంతికి థియేటర్స్‌ ఓపెన్‌ అయి, ప్రేక్షకులందరూ తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మరిన్ని వార్తలు