Konaseema Thugs Review: కోనసీమ థగ్స్ మూవీ రివ్యూ

24 Feb, 2023 11:13 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : కోనసీమ థగ్స్
నటీనటులు: హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునీష్ కాంత్, అనస్వర రాజన్‌, శరత్ అప్పని మరియు తదితరులు
నిర్మాణ సంస్థ: హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు
దర్శకత్వం:  బృంద
సంగీతం: శామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ: ప్రీయేష్ గురుస్వామి
ఎడిటర్‌: ప్రవీణ్ ఆంటోనీ
విడుదల తేది: ఫిబ్రవరి 24, 2023

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా గోపాల్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘థగ్స్‌’. పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో టాలీవుడ్  అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
శేషు(హృదు హరూన్) ఒక అనాధ. కాకినాడ రౌడీ పెద్దిరెడ్డి దగ్గర పని చేస్తుంటాడు. అక్కడే ఓ అనాధాశ్రయంలో ఉంటున్న మూగ అమ్మాయి కోయిల(అనస్వర రాజన్‌)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకున్న సమయంలో ఓ హత్య కేసులో అరెస్ట్‌ అవుతాడు. కాకినాడ జైలులో దొర(బాబీ సింహ), మధు(మునీష్ కాంత్)తో పాటు రకరకాల మనుషులు పరిచయం అవుతారు. వీరందరితో కలిసి జైలు నుంచి పారిపోవడానికి శేషు ఒక ప్లాన్‌ వేస్తాడు. జైలు గదిలో సొరంగం తవ్వి దాని గుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తారు? పోలీసుల కళ్లుకప్పి సొరంగం ఎలా తవ్వారు? చివరికి వాళ్లు తప్పించుకున్నారా? లేక దొరికిపోయారా? అసలు శేషు ఒకరిని ఎందుకు హత్య చేశారు? జైలు సిబ్బంది శేషుని ఎందుకు చంపాలనుకుంటుంది?  కోయిల, శేషు కలిశారా లేదా? వీరికి చిట్టి ఎలాంటి సహాయం చేశాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
కొన్ని సినిమాలలో ఒక్క పాయింట్‌ చుట్టే కథ తిరుగుతుంది. చెప్పుకోవడానికి కథ కూడా పెద్దగా ఉండదు. కానీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. ఆ కోవలోకే కోనసీమ థగ్స్‌ మూవీ వస్తుంది. ఈ మూవీ కథంతా జైలులోనే.. కొద్ది మంది పాత్రల చుట్టే తిరుగుతుంది. ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో వేసే ఎత్తులు..  అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్తితులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథను తీర్చిదిద్దారు దర్శకురాలు బృందా గోపాల్‌. కథను నిదానంగా ప్రారంభించి,  ప్రేక్షకులు అయోమయానికి గురికాకుండా నేరేట్ చేయడంలో దర్శకురాలు సఫలం అయ్యారు.

 అయితే శేషు లవ్‌స్టోరీతో పాటు దొర(బాబీ సింహా) ఎందుకు జైలులో పడ్డారో ప్రేక్షకులకు తెలియడం మినహా ఫస్టాఫ్‌లో ఏమీ ఉండదు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎస్కేప్ ప్లాన్‌తో విరామానికి ముందు మాత్రమే కథ వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. జైలు నుంచి పారిపోవడానికి హీరో చేసే ప్రతి ప్రయత్నం సినిమాటిక్‌గా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కామెడీ, రొమాన్స్ ఉన్నప్పటికీ కథను తప్పుదోవ పట్టించకుండా బృందా రాసుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది. యాక్షన్స్‌ సీన్స్‌ కూడా చాలా రియలిస్ట్‌గా ఉంటాయి. ఫస్టాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి, తెలుగు టైటిల్‌ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోస్థాయిలో ఉండేది. 

ఎవరెలా చేశారంటే..
హీరో హ్రిదు హరూన్‌కి ఇది తొలి సినిమా. అయినా కూడా ఎలాంటి బెణుకు లేకుండా చక్కగా నటించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు కానీ యాక్షన్‌ సన్నివేశాల్లో ఇరగదీశాడు. హీరోగా దొర పాత్రలో బాబీ సింహా జీవించేశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. డైలాగ్స్‌ పెద్దగా లేకున్నా.. బాబీ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్‌ అయింది. ఇక కోయిల పాత్రకు అనస్వర రాజన్‌ న్యాయం చేసింది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ  ఉన్నంతలో చక్కగా నవ్వించింది. దొంగతనం కేసులో జైలుకు వచ్చిన మధుగా మునీష్ కాంత్ తనదైన కామెడీతో నవ్వించాడు. శరత్ అప్పనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. శామ్ సి ఎస్ సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్‌ అయింది. ఎడిటర్‌ ప్రవీణ్ ఆంటోనీ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు