Kondapolam Review: ‘కొండ పొలం’మూవీ రివ్యూ

8 Oct, 2021 13:27 IST|Sakshi
Konda Polam Movie Review
Rating:  

టైటిల్‌ : కొండ పొలం
నటీనటులు :   వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, హేమ, అంటోని, రవిప్రకాశ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
దర్శకత్వం : క్రిష్‌ జాగర్లమూడి
సంగీతం : ఎమ్‌ ఎమ్‌ కీరవాణి
సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వీఎస్
ఎడిటింగ్‌: శ్రావన్ కటికనేని
విడుదల తేది : అక్టోబర్‌ 8,2021

ఉప్పెన‌’లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం

కథేంటంటే..?
కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్‌ అలియాస్‌ రవీంద్ర(వైష్ణవ్‌ తేజ్‌) బీటెక్‌ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం లేకపోవడంతో అతనికి ఉద్యోగం లభించదు. దీంతో అతను తిరిగి పల్లెకు వస్తాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన రవీంద్రకు తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొంతమంది కొండపొలం(గొర్రెల మందలను తీసుకొని అడవుల్లోకి వెళ్లడం)చేస్తున్నారని, తమ గొర్రెలను కూడా తీసుకొని వారితో నల్లమల అడవుల్లోకి వెళ‍్లమని చెబుతాడు. పెద్ద చదువులు చదివిన రవీంద్ర.. తాత సలహాతో నాన్న గురప్ప (సాయి చంద్‌)కు సహాయంగా అడవికి వెళ్తాడు. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ అడవి అతనికి నేర్పిన పాఠాలేంటి? తన చదువు కోసం తండ్రి పడిన కష్టాలేంటి? ‘కొండపొలం’అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని ఏవిధంగా ఫారెస్ట్‌ ఆపీసర్‌ అయ్యాడు? అనేదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే... 
మంచి చదువు ఉండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, గొర్రెల కాపరిగా మారిన యువకుడు రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు. ‘ఉప్పెన’లో మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించి వైష్ణవ్‌... కొండపొలంలో గొర్రె కాపరుల సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కనిపించాడు. ఇక, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయి ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ అద్భుత నటను కనబరిచింది. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్‌ని డామినేట్‌ చేసిందనిపిస్తుంది. ఆమె పాత్ర తీరే అలా ఉండడం అందుకు కారణం. అడవికి వచ్చిన రవీంద్రలో పట్టుదల ఏర్పడటానికి పరోక్షంగా కారణమైన ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసింది రకుల్‌. రవీంద్ర తండ్రి గురప్ప పాత్రలో సాయిచంద్‌ పరకాయ ప్రవేశం చేశాడు. ఓ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అచ్చం అలానే తెరపై కనిపించాడు. రవీంద్రతో పాటు అడవికి వెళ్లే ఇతర పాత్రల్లో రవి ప్రకాశ్‌, హేమ, మహేశ్‌ విట్ట, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే...  
అడవుల పరిరక్షణ, జంతువులను వేటాడే వేటగాళ్ల మీద, స్మగ్లర్ల మీద తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘మృగరాజు’నేపథ్యం కూడా ఇదే. అయితే పశువులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం అడవి వెళ్లే గొర్రెకాపరులు, అక్కడ వారి జీవన పద్దతిపై ఇంతవరకు ఏ చిత్రమూ రాలేదు. ఆ రకంగా చూస్తే ‘కొండపొలం’ ఓ కొత్త సినిమా అనే చెప్పాలి.  ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో ‘కొండపొలం’చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్‌. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా అదే పేరుతో వెండితెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు కూడా సన్నపురెడ్డి అందించడం గమనార్హం. అయితే నవలలో లేని ఓబులమ్మ పాత్రను ఈ సినిమా కోసం రచయిత సన్నపురెడ్డి సృష్టించారు. గొర్రె కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై చాలా సహజసిద్దంగా ఆవిష్కరించారు. గొర్రెలను  తమ సొంత బిడ్డలుగా భావించే గొర్రెకాపరులు..వాటికి ఆహారం అదించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కొండపొలం చేయడం అంటే మామూలు విషయం కాదు. అడవితో మనిషికి ఉండే బంధాన్ని చక్కడ చూపించాడు డైరెక్టర్‌.

పిరికి వాడైన హీరో.. తన గొర్రెలను కాపాడుకోవడం కోసం పులితో పోరాటం చేయడం సినిమాకు హైలైట్‌. అయితే ‘కొండపొలం’నవల చదివినప్పుడు కలిగే ఉత్కంఠ, భావోద్వేగాలు ఈ సినిమాలో పండకపోవడం మైనస్‌. అలాగే కొన్ని సాగదీత సీన్స్‌ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్‌లో సాగినంత వేగం.. సెకండాఫ్‌లో లేదు. ఓబులమ్మ-రవీంద్ర ప్రేమ కథ ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాకి ప్రధాన బలం సన్నపురెడ్డి సంభాషణలు. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’,‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’,‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’లాంటి డైలాగ్స్‌ హృదయాన్ని తాకడంతో పాటు ఆలోచింప చేస్తాయి. కీరవాణి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. ‘ర‌య్ ర‌య్ ర‌య్యారే’అంటూ తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ శ్రవణ్ కటికనేని తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ.. ఓ మంచి సందేశాత్మక మూవీని చూశామనే అనుభూతి మాత్రం ప్రేక్షకుడికి కలుగుతుంది.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు