షూటింగ్‌కు అనుమతి, మెగాస్టార్‌కు మంత్రి నివాసంలో బస

12 Feb, 2021 14:44 IST|Sakshi

ఖమ్మం జిల్లా ఇల్లందు గనుల్లో షూటింగ్‌

10 రోజుల పాటు చిత్రీకరణ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ తెలంగాణ మంత్రిని కలిశారు. ఖమ్మం జిల్లాలో మంత్రిని కలిసి గనుల్లో సినిమా షూటింగ్‌ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి అనుమతి ఇప్పించారని తెలిసింది. అయితే షూటింగ్‌ జరిగినన్ని రోజులు చిరంజీవి తన నివాసంలో ఉండాలని మంత్రి కోరారు. ఆయన విజ్ఞప్తితో చిరు మంత్రి నివాసంలో బస చేయనున్నారు.

మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో ఆచార్య సినిమా షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ మేరకు అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను దర్శకుడు కొరటాల శివ కలిసి విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఇవ్వడంతో పాటు మెగాస్టార్‌ చిరంజీవికి తానే ఆతిథ్యం ఇస్తానని ఆఫర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్‌లో షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


 
జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్‌, అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో షూటింగ్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని చిత్రబృందం తెలిపింది. మంత్రిని కలిసిన అనంతరం దర్శకుడు కొరటాల శివ మాట్లాడారు. ‘ప్రస్తుతం ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని… సినిమా షూటింగ్‌లకు జిల్లాలో చాలా అనువైన ప్రాంతాలున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఖమ్మం స్వరూపం నేడు పూర్తిగా మారిపోయింది’ అని తెలిపారు. దీనికి కృషి చేసిన మంత్రి పువ్వాడకు ఈ సందర్భంగా దర్శకుడు అభినందనలు తెలిపారు. 

అయితే కొన్నిరోజుల కిందట ఆచార్య షూటింగ్‌లోనే చిరంజీవిని, కొరటాల శివను మంత్రి కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా కొణిదెల ప్రొడక‌్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

మరిన్ని వార్తలు