Koratala Siva: ప్రతి సినిమా ఓ పరీక్షే: కొరటాల శివ

28 Apr, 2022 07:51 IST|Sakshi

Koratala Siva Interesting Comments On Acharya Movie: ‘‘నా సినిమాల్లో స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్, వాటి తాలూకు ఎమోషన్స్‌ మాత్రమే ఉంటాయి. నావి సందేశాత్మక సినిమాలు అనుకోను. ఒకవేళ నా సినిమాల వల్ల ప్రభావితమై మంచి పనులు జరిగితే చాలా సంతోషపడతాను’’ అని అన్నారు దర్శకుడు కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్‌ 28) రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు కొరటాల శివ పంచుకున్న విశేషాలు. 

నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ ఉండే ఓ వ్యక్తి ఓ టెంపుల్‌ టౌన్‌లోకి వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఆచార్య’ కథ రాసుకున్నాను. ఏ సినిమాలో అయినా విలన్‌పై హీరో పోరాడుతున్నాడు అంటే అది ధర్మం కోసమే. అయితే ధర్మం అవసరం అని ‘ఆచార్య’ సినిమాలో అండర్‌లైన్‌ చేశానంతే. కాకపోతే కథా నేపథ్యం కాస్త కొత్తగా ఉంటుంది.

చదవండి: సిద్ధ పాత్రను పవన్‌ కల్యాణ్‌ చేసేవాడు!: చిరంజీవి

ఇద్దరి లక్ష్యం ఒక్కటే 
ధర్మస్థలి అనే టెంపుల్‌ టౌన్‌లో సిద్ధ అనే విద్యార్థి (రామ్‌చరణ్‌ పాత్ర) ఏ సమస్యని అయినా సరే అందంగా డీల్‌ చేస్తాడు. కానీ ‘ఆచార్య’ (చిరంజీవి పాత్ర పేరు) ఆవేశపరుడు. అయితే ఇద్దరి లక్ష్యం ఒకటే. టెంపుల్‌ టౌన్‌లో ఉన్న సిద్ధ ఎందుకు అడవులకు వెళ్లాడు? అడవుల్లో ఉండాల్సిన ‘ఆచార్య’ ఎందుకు టెంపుల్‌ టౌన్‌కు రావాల్సి వచ్చింది అన్నదే కథ. 

రెండు కళ్లు చాల్లేదు 
చిరంజీవిగారు ఏ స్థాయి కమర్షియల్‌ స్టారో నాకు తెలుసు. ఆయన ఇమేజ్‌ను తగ్గించకుండా కమర్షియల్‌ పంథాలోనే ‘ఆచార్య’ కథ చెప్పాం. మాస్‌ ఎంగేజింగ్‌ బ్లాక్స్‌ ‘ఆచార్య’లో చాలానే ఉన్నాయి. తండ్రీ కొడుకులు కాబట్టి చిరంజీవి, చరణ్‌ల మధ్య మంచి సింక్‌ ఉంది. ఇద్దరూ బాగా చేశారు. ఇద్దరూ నటిస్తుంటే చూడ్డానికి నాకు రెండు కళ్లూ సరిపోలేదు. సిద్ధ క్యారెక్టర్‌ ఇంట్రవెల్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు ఉంటుంది. 
 
ఫ్రీగా చేయలేదు
‘ఆచార్య’ సినిమాని ఫ్రీగా చేయలేదు. రిలీజ్‌ తర్వాత పారితోషికాలు తీసుకుంటాం. ప్రతి సినిమా నాకు టెన్షనే. ఓ పరీక్ష రాసినట్లే. పరీక్ష బాగా రాయకపోతే ఏ సమస్యా లేదు. అదే బాగా రాస్తే మనం అనుకున్న మార్కులు వస్తాయా? రావా? అని టెన్షన్‌. ‘ఆచార్య’ పరీక్ష బాగా రాశాను. మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. 

ఎన్టీఆర్‌ సినిమా అప్‌డేట్‌.. 
నా తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుంది. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే.. ఆ రోజు ఈ సినిమాకి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చే అవకాశం ఉంది.  

'నేను తెలుసుకున్న పవర్‌ఫుల్‌ సోల్స్‌ క్యారెక్టర్స్‌లో స్వామి వివేకానంద ఒకరు. మీడియా, సోషల్‌ మీడియా వంటి మాధ్యమాలు లేని రోజుల్లో కూడా ఆయన వల్ల చాలామంది ప్రభావితం అయ్యారు. ప్రపంచం మొత్తం చూసేలా చాలా పెద్ద స్థాయిలో స్వామి  వివేకానందగారి మీద ఓ సినిమా చేయాలని ఉంది. కానీ చాలా పరిశోధన చేయాలి. నాకు అంత అనుభవం రావాలి. హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ‘గాంధీ’ సినిమాను ఎలా తీశారో అలా తీయాలని ఉంది.' అని కొరటాల శివ పేర్కొన్నాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: బిగ్‌ సర్‌ప్రైజ్‌, ఆచార‍్యలో అనుష్క స్పెషల్‌ రోల్‌!

మరిన్ని వార్తలు