రవితేజ సినిమా.. పదే పదే క్యాన్సిల్‌ ఎందుకు?

9 Jan, 2021 12:28 IST|Sakshi

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’.. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న అంటే ఈ రోజు థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 1000 థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉంది. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే పట్టుదలతో రవితేజ ఉన్నారు. క్రాక్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో  ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఈ విషయాన్ని థియేటర్ల యజమానులు ట్విటర్‌ వేదికగా తెలియజేశారు.

వాస్తవానికి శుక్రవారం రాత్రి అంటే 8వ తేదీనే అమెరికాలో ప్రీమియర్స్ పడాలి. కానీ, అనివార్య కారణాల వల్ల అవి కాస్తా రద్దు అయ్యాయి. అలాగే, మార్నింగ్ షో విషయాలోనూ సందిగ్ధత నెలకొంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు రవితేజ అభిమానులు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.

అమెరికాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ‘క్రాక్' మార్నింగ్ షో రద్దయ్యింది. మరీ ముఖ్యంగా మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలు చివరి నిమిషంలో చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. డిస్టిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్లు పూర్తవకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. దీనిపై మాస్ మహారాజా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఫైనాన్సియల్ క్లియరెన్స్ అయిపోయిందని.. 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని ‘క్రాక్’ పీఆర్ టీమ్ తొలుత స్పష్టం చేసింది. అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్లలో ఉదయం 11 గంటల షోకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఫ్యాన్స్‌ భావించారు. కానీ ఆ షో పడలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు ‘ప్రెస్‌ షో’ వేయనున్నట్లు మరొకసారి పీఆర్‌ టీమ్‌ తెలిపింది. షో ఆలస్యం అయినందుకు చింతిస్తున్నామని, ఈ విషయంలో సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పీఆర్‌ఓ వంశీ శేఖర్‌ పేర్కొన్నారు.

‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కావడంతో ‘క్రాక్’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనుండగా.. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. రవితేజ పోలీస్ క్యారెక్టర్ చేయడం, ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించారు.

>
మరిన్ని వార్తలు