Krishnam Raju: పేరు మార్చేసరికి ‘కృష్ణంరాజు’కు ఏ పని చేసినా కలిసొచ్చేది కాదట..

12 Sep, 2022 11:50 IST|Sakshi

కృష్ణంరాజుకి  శివుడు అంటే  ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు..


కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్‌ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్‌ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ).


మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా?
సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్‌ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’  పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. 

దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్‌ వచ్చేవా?
మేకప్‌ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్‌ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. 

మరిన్ని వార్తలు